బెల్లంపల్లి, మే 26 : బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం ఇప్ప ట్లో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. గతేడాది నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగగా, జనవరి 3న ఫలితాలు విడుదలయ్యాయి. గెలిచిన వెంటనే కార్యాలయాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉండగా, ఎమ్మెల్యే గడ్డం వినోద్ దాటవేసే ధోరణి వల్ల ఆ దిశగా అడుగులు పడడం లేదు. అప్పట్లో కార్యాలయం వాస్తు బాగాలేదని, గదులు, ఇతర విభాగాలకు మరమ్మతులు చేయాలని జాప్యం చేశారు. తీరా.. మొత్తం పూర్తయ్యాక ఇప్పుడు శుభముహూర్తాలు లేవనే సాకుతో మరో రెండు నెలలు వాయిదా వేశారు.
ఆ తర్వాతైనా ప్రారంభిస్తారా, లేక మరే ఇతర కారణమేదైనా చూపించి జాప్యం చేస్తారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇలాగైతే సామాన్య ప్రజానీకానికి ఇంకెప్పుడు అందుబాటులో ఉంటారని, తమ సమస్యలు ఎవ్వరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మంచి రోజు చూసుకొని సీనియర్ పురోహితుల సూచన మేరకు కార్యాలయాన్ని ప్రారంభిస్తానని, అప్పటి వరకు వారంలో రెండు రోజులు బెల్లంపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటానని శనివారం విలేకరుల సమావేశంలో తెలిపిన విషయం విదితమే.
కనీసం ఈ మాటకైనా కట్టుబడి ఉంటారా లేదా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా గెలిచిన తర్వాత స్థానికంగా ఉంటానని సుభాష్‌నగర్ వేంకటేశ్వరస్వామి ఆల యం ముందు బాండ్ రిలీజ్ చేసిన వినోద్.. ఇప్పుడా విషయంపై నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే అడపాదడపా అధికారిక కార్యక్రమాలకు బెల్లంపల్లికి వచ్చినప్పుడు ఆయనను కలిసి సమస్యలు విన్నవించుకుందామంటే.. తమకే దొరకండలేదని కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా దాటవేసే ధోరణికి స్వస్తి పలికి బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ రడగంబాలబస్తీలోని ఆయన నివాసంలో ప్రతిరోజూ అందుబాటులో ఉం డాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.