నార్నూర్ : సీజనల్ వ్యాధులపై ( Seasonal diseases ) అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్ వో కుడ్మెత మనోహర్ ( Manohar ) వైద్య సిబ్బందికి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలిస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగులకు అందే వైద్య తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న తరుణంలో అపరిశుభ్రత లోపించకుండా , డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. హై రిస్క్ గర్భిణిలో ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పరిశుభ్రత తోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని విషయాన్ని పల్లెలలో స్థానికులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి జితేందర్ రెడ్డి, హెచ్ఈవో తులసీదాస్, వైద్య సిబ్బంది నాందేవ్, చరణ్ దాస్, సత్యావ్వ , గణేష్ కుమారి, విలాస్, కైలాస్ తదితరులున్నారు.