MANDAMARRI | మందమర్రి రూరల్, మార్చి29: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. శనివారం రాత్రి మండలంలోని సారంగపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల తుర్కపల్లి గ్రామంలో పోలీస్ కళాబృందం రామగుండం సిపి అంబర్ కిషోర్ జా ఆదేశాల మేరకు వివిధ అంశాలపై కళాజాత బృంద ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ బాల్య వివాహాలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
గ్రామాలలో బాల్య వివాహాలు జరిగినట్లయితే పోలీసులకు, ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. యువత గంజాయి, గుట్కా లాంటి మాదక ద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులలో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. యువత చెడు వ్యసనాల బారిన పడకుండా సన్మార్గంలో పయనిస్తూ తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.