మంచిర్యాల, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతంగా ఉందని చెప్పిన సర్కారు.. సర్వే సరిగా జరగలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో లక్షలాది కుటుంబాలను సర్వే చేయకుండానే బీసీ జనాభాపై స్పష్టత ఎలా వచ్చిందంటూ బీసీ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా 16 లక్షల మంది వివరాలు సేకరించలేకపోయామని చెప్తున్న సర్కారు.. తుది లెక్కలను ఎలా తేల్చిందో చెప్పాలంటున్నారు. గత సర్కారు చేసిన సర్వేలు, అంచనాల మేరకు రాష్ట్రంలో బీసీ జనాభా 50 శాతం నుంచి 52 శాతం ఉండాలన్నారు. కాంగ్రెస్ సర్కారు కేవలం 46.2 శాతం బీసీలు ఉన్నట్లు తేల్చడం బాధాకరమంటున్నారు.
సకల జనుల సర్వేకు ఇప్పుడు చేసిన సర్వేకు బీసీ జనాభా 21 లక్షలు తగ్గిందంటున్నారు. ఎక్కడైనా జనాభా పెరగాలే తప్ప, తగ్గడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే బీసీ జనాభాను తక్కువ చేసి చూపించారంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు సర్కార్ తీసిన లెక్కల మేరకైనా అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా చర్చతో లాభం ఏం ఉండదంటున్నారు. ఇలా కాని పక్షంలో మరోసారి కులగణన చేయాలని, బీసీ జనాభా ఎంత ఉందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలంటూ రాజ్యాంగం పట్టుకుని దేశమంతా తిరుగుతున్నా రాహుల్ గాంధీ.. తెలంగాణ బీసీల విషయంలో అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సర్వే చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రిజర్వేషన్ శాతం తగ్గించే కుట్ర..
నిర్మల్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనకు ఎలాంటి శాస్త్రీయత లేదు. అన్నీ తప్పుడు లెక్కలే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలను పరిగణలోకి తీసుకోకుండానే 50 శాతానికి పైగా బీసీలే ఉన్నరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ తప్పుడు గణాంకాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. ముస్లిం మైనార్టీలు 10 శాతం, బీసీలు 46 శాతం కలుపుకొని మొత్తం 56 శాతం ఉన్నరని చెప్పడం దారుణం. ముస్లింలను కలపక ముందే బీసీల జనాభా 55 నుంచి 56 శాతం ఉంటుంది. ఈ తప్పుడు లెక్కలను ప్రభుత్వం వెంటనే సరి చేయాలి. లేకుంటే మళ్లీ కుల గణన సర్వే చేసి వాస్తవాలను బయట పెట్టాలి. ప్రస్తుత లెక్కలతో రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు అన్ని రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి డిక్లరేషన్‌కు కట్టుబడి ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి. కొత్తగా చెబుతున్న బీసీల సంఖ్య బూచీ చూపించి రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించే కుట్రలకు పాల్పడితే ఊరుకోం. ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే రైతుభరోసాను రూ. 15 వేలు ఇస్తామని చెప్పి రూ. 12 వేలకు తగ్గించారు. అదేవిధంగా ఇప్పుడు బీసీల సంఖ్యను తక్కువగా చూపించి రిజర్వేషన్ శాతాన్ని కూడా తగ్గించే అవకాశమున్నది.
– ఎంబడి చంద్రశేఖర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, నిర్మల్
చిత్తశుద్ధితో సర్వే చేయలేదు..
కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈ సర్వే చేయలేదు. బీసీలను తగ్గించి చూపాలనే అగ్రవర్ణాల కుట్రలో భాగమే లోపాల పుట్టయిన ఈ సర్వే వివరాలు. బీసీ జనాభాను తగ్గించి, రిజర్వేషన్లు రాకుండా చేయాలనే కుట్ర దాగుంది. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. రాబోయే రోజుల్లో బీసీల తడాఖా చూపిస్తాం.
– వడ్డేపల్లి మనోహర్, జిల్లా బీసీ జేఏసీ నాయకుడు, మంచిర్యాల
తప్పుల తడకగా సర్వే..
ఈ సర్వే తప్పుల తడకగా ఉంది. బీసీ జనాభా ఉన్నదాని కంటే తక్కువగా చూపించారు. దేశవ్యాప్త కులగణన ఎందుకు చేయడం లేదు. రిజర్వేషన్లు పెంచడం ఇష్టం లేకనే ఇలా తప్పుడు లెక్కలు చెప్పారు. హిందూ బీసీ జనాభానే 56 శాతం వరకు ఉంటుంది. దీనిపై ప్రభుత్వాన్ని ఎండగడుతాం. సర్వేను ప్రామాణిక పద్ధతులతో చేయలేదు. కుంటిసాకులతో మొత్తం సర్వే చేయలేదు. ప్రజలు అందుబాటులో లేరని బీసీ జనాభాలో కోత విధించారు.
– గుమ్ముల శ్రీనివాస్, జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, మంచిర్యాల
శాస్త్రీయత లేని సర్వే
కోటపల్లి, ఫిబ్రవరి 3 : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, ఉపాధి, కుల సర్వే శాస్త్రీయత లేని సర్వే. ప్రభుత్వం పట్టింపులేని తనం కారణంగా మొదటి నుంచి సర్వేలో తప్పులే దొర్లాయి. ఇందుకు నిదర్శనం నాలుగు గ్యారెంటీల అమలులో అర్హుల పేర్లు లేకపోవడమే. ఇలాంటి అసమగ్ర సర్వేను ఏరకంగా ప్రామాణికంగా తీసుకొని బీసీల జనాభా సంఖ్యను నిర్ణయిస్తారు. ఇంకా సర్వేకు దూరంగా 16 లక్షల మంది ఉన్నారు. కానీ సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెప్పడం బీసీలను మోసగించడమే అవుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మరో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. సర్వే చేసి నిజమైన బీసీల సంఖ్యను వెలువరించాలి.
– తాటికొండ సురేశ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం యూత్ నాయకుడు
సర్వే పూర్తి చేయకుండా లెక్కలు ఎలా తేల్చుతారు
కోటపల్లి, ఫిబ్రవరి 3 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటి సర్వే పూర్తిగా తప్పుల తడక. రాష్ట్రంలో వంద శాతం సర్వే పూర్తి చేసి నివేదిక వెల్లడించాల్సి ఉంది. కానీ 96.9 శాతం మాత్రమే సర్వే చేసి పూర్తయిందంటే ఎలా? మిగతా 3.1 శాతం కుటుంబాల సర్వే చేయకుంటే సర్వే ఎలా పూర్తి అవుతుంది. అసంపూర్తి సర్వేను ప్రభుత్వం ఆమోదిస్తే బీసీలకు అన్యాయం జరిగే అవకాశముంటుంది. ఇలాంటి అసంపూర్తి సర్వేను ఆమోదిస్తే బీసీలు తీవ్రంగా నష్టపోతారు. సర్వేను పూర్తి చేసిన తర్వాతే గణాంకాలు వెలువరిస్తే బీసీలకు న్యాయం జరుగుతుంది.
– గాదె శ్రీనివాస్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి