హాజీపూర్, జనవరి 12 : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే వార్డుల వారీగా ఫొటోతో కూడిన ఓటరు లిస్టును ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించింది. ఇక్కడ ఉన్న బ్యాలెట్ బాక్స్‌లతో పాటు మహారాష్ట్ర నుంచి మరి కొన్నింటిని తీసుకు వచ్చి భద్రపర్చింది. జిల్లాలోని 16 మండలాల్లో 311 గ్రామ పంచాయతీలుండగా, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది.
మొదటి విడుతలో బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల, తాండూర్, వేమనపల్లి మండలాల్లో, రెండో విడుతలో చెన్నూర్ నియోజక వర్గంలోని చెన్నూర్, భీమారం, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో, ఇక మూడో విడుతలో మంచిర్యాల నియోజకవర్గంలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 2,730 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేయగా, ఎన్నికల నాటికి ఆయాచోట్ల ర్యాంపులు, విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, వీల్ చెయిర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నది.
సర్పంచ్ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ పింక్ కలర్లో ఉంటుంది. నోటాతో పాటు 30 గుర్తులు బ్యాలెట్ పేపర్లో ముద్రించనున్నారు. 30 కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే మరో బ్యాలెట్ పేపర్ ముద్రించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సర్పంచ్ అభ్యర్థికి ఉంగరం, బ్యాట్, కత్తెర, లేడీ పర్స్, పుట్‌బాల్, టూత్‌పేస్టు, టీవీ రిమోట్, నల్లబోర్డు, చెత్తడబ్బా, స్పానర్, బెండకాయ, నల్లబోర్డు, వజ్రం, కొబ్బరి తోట, హ్యాండిల్, డోర్, బకెట్, టీకప్పు, జల్లెడ, చేతికర్ర, పలక, మంచం, టేబుల్, బ్రష్, టార్చిలైట్, బ్యాట్స్‌మెన్, బిస్కెట్, ప్లూట్, పడవ, చెప్పులు, చైన్, బెలూన్, స్టంప్స్ తదితర గుర్తులుంటాయి.
ఇక వార్డు సభ్యుల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. ఇందులో 20 గుర్తులతో పాటు ఒక నోటాతో పాటు మొత్తంగా 21 గుర్తులుంటాయి. గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, కుండ, ఈల, గరిట, డిష్‌యాంటీనా, మూత, గరిటె, గాజు గ్లాసు, ఐస్‌క్రీం, కవరు, పోస్టు డబ్బా, నెక్‌టై, హాకీ కర్రబంతి, పెట్టె, కటింగ్ ప్లేయర్, కేటిల్, విద్యుత్ గుర్తులుంటాయి.
2019లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ సర్పంచ్ రిజర్వేషన్లు పదేళ్లపాటు కొన సాగుతాయని ప్రకటించింది. ఇక ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రిజర్వేషన్లు మార్చాలని చూస్తున్నది. బీసీలకు రిజర్వేషన్లు పెంచే దిశగా ఆలోచిస్తున్నది. స్థానిక సంస్థల్లో రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయో అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. రొటేషన్ పద్ధతిలో అయితే ప్రస్తుతమున్న రిజర్వేషన్లు పెంచేందుకు మారుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన వస్తే ఎవరు పొటీలోకి వస్తారో అనే చర్చ సాగుతున్నది.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడు ఆదేశించినా గ్రామ పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓటరు లిస్టు, బ్యాలెట్ బాక్స్‌లతో పాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచాం. జిల్లాలో పది రోజల వ్యవధిలో మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తాం.
– వెంకటేశ్వర్రావు, డీపీవో, మంచిర్యాల