చెన్నూర్/మంచిర్యాలటౌన్/బెల్లంపల్లి, ఆగ స్టు 21 : రుణమాఫీ చేయడంలో అడ్డగోలు ఆంక్షలతో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నందుకు నిరసనగా బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మే రకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేయనున్నట్లు బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షు డు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలిపారు.
ఈ మేరకు బుధవారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. రుణమాఫీ చేయడంలో రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాలలో వెంకటేశ్వర టాకీస్, బెల్లంపల్లిలో తహసీల్ కార్యాలయం ఎదుట, చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రైతులతో కలిసి ధర్నా చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ నిరసనలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అర్హులందరికీ రుణమాఫీ చేయాలి
మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్
దండేపల్లి, ఆగస్టు 21: అర్హులైన రైతులందరికీ రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని, బ్యాంకులకు వచ్చే వారికి ఇబ్బంది కలిగించవద్దని అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బుధవారం దండేపల్లిలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకును సందర్శించి, రుణమాఫీ అమలు తీరును పరిశీలించారు. రుణమాఫీలో ఇబ్బందులను కలెక్టర్‌కు రైతులు విన్నవించారు. రుణమాఫీపై అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించి, వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. లింగాపూర్ పాఠశాలలో అమ్మ ఆదర్శ పనుల పూర్తి చేయాలని ఆదేశించారు. రైతువేదికను, పల్లె దవాఖానను సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
మాకెందుకు రుణమాఫీ చేయలె?
చెన్నూర్, ఆగస్టు 21: ‘కాంగ్రెస్ ప్రభుత్వం మాకెందుకు రుణ మాఫీ చేయలేదు’ అంటూ పలువురు చెన్నూర్ మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యవసాయ శాఖ అధికారులను నిలదీశారు. రుణమాఫీ కాకపోవడంతో బుధవారం చెన్నూర్‌లోని మండల వ్యవసాయశాఖ కార్యాలయానికి పెద్ద సంఖ్య లో రైతులు తరలివచ్చారు. దీంతో కార్యాలయంలోని గదులు రైతులతో కిక్కిరిసిపోయాయి. వారిని పోలీసులు అదుపు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ ఎన్నికల ముందు రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మాఫీ చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ చేయాలని కోరుతూ వ్యవసాయ పనులు వదులుకొని బ్యాంకులు, వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.