చెన్నూర్, డిసెంబర్ 15 : ఆచరణ సాధ్యం కాని హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని మూడో విడుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం చెన్నూర్ పట్టణంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నాయని, వారిచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చలేదని, సీఎం నుంచి కింది స్థాయి నేతల వరకు అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన జూబ్ల్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అనేక అరాచకాలు, దౌర్జన్యం చేసినా.. బీఆర్ఎస్ పార్టీ 39 శాతం ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచిందన్నారు.
మొదటి విడుత, రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేశారని, తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకుడిని హత్య చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులనే గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 85 శాతం నుంచి 95 శాతం వరకు సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందన్నారు. ఈ రెండు విడుతల్లో కాంగ్రెస్ పార్టీ పట్టుమని 50 శాతం కూడా సర్పంచ్ స్థానాలను గెలుచుకోలేదని, దీంతో ఈ ప్రభుత్వంపై ప్రజలకున్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సొంత గ్రామాల్లో వారి సర్పంచ్ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడిస్తున్నారని పేర్కొన్నారు.
చెన్నూర్ నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. ఇక్కడి నుంచి గెలిచి మంతి అయిన వివేక్ వెంకటస్వామి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ఈ విషయం ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, పెద్ద పరిశ్రమ పెట్టిస్తానని, 45 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదన్నారు. తండ్రికి మంత్రి పదవి, కొడుక్కి ఎంపీ పదవి, తన అన్నకు ఎమ్మెల్యే పదవి.. ఇలా తన ఇంట్లో మూడు ఉద్యోగాలు వచ్చాయని, కానీ నియోజకవర్గంలోని ఏ ఒక్కరికీ ఉద్యోగం రాలేదని చెప్పుకొచ్చారు. వివేక్ వెంకటస్వామి ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నారని, పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లింగన్నపేటకు, దుగ్నెపల్లి, గంగిపెల్లికి వెళ్లిన మంత్రిని ప్రజలు, మహిళలు నిలదీశారని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో చెన్నూర్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించాలని, అలాగే తాను కోట్లాది రూపాయలతో మంజూరు చేయించిన పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనవరిలో వేలాది మందితో చెన్నూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. చెన్నూర్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.53 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులను మంత్రి వివేక్ పక్కన పెట్టేశారన్నారు. పట్టణంలో చేపట్టిన బస్ డిపో, వంద పడకల దవాఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మినీస్టేడియం, పెద్ద చెరువు, కుమ్మరికుంట మినీ ట్యాంకు బండ్లాంటి నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారని ఆయన ఆరోపించారు.
మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయించిన నిధులను కూడా ఆపి వేశారని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు, అన్ని గ్రామాలకు, పట్టణాలకు తాగు నీరందించే చెన్నూర్ ఎత్తి పోతల పథకానికి రూ 1600 కోట్లు మంజూరు చేయించి, అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించానని, దాన్ని కూడా పక్కకు పెట్టించారని మండిపడ్డారు. మందమర్రికి పామాయిల్ ఫ్యాక్టరీ తీసుకొస్తే మంత్రి పట్టించుకోకపోవడం వల్ల తరలిపోయిందన్నారు.
గోదావరి, ప్రాణహిత నదుల ముంపునకు గురికాకుండా కరకట్టలు కట్టిస్తామని, 26 ముంపు గ్రామాల్లో 3 వేల పైచిలుకు ఎకరాల ముంపు భూములను ప్రభుత్వంతో కొనిపిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని ఆయన ఆరోపించారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చిలో 26 ముంపు గ్రామాల్లో నెల రోజుల పాటు పాద యాత్ర చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజా రమేశ్, మాజీ ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జడ్పీటీసీ మోతె తిరుపతి, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.