మందమర్రి, అక్టోబర్ 27 : ప్రజలు ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటువేసి చెన్నూర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని, అభివృద్ధిని కొనసాగిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. మందమర్రి పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో గల శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేసి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో గల పాలచెట్టు ఏరియా, మూడో జోన్ కార్మిక కాలనీలు, ఎమ్మెల్యే కాలనీలో నాయకులు, కార్యకర్తలతో కలసి విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను, సీఎంగా కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు.
కాలనీల్లో మహిళలు మంగళహారతులతో బొట్టు పెట్టి, ఆయనను ఆహ్వానించారు. పాలచెట్టు ప్రాంతంలో వ్యాపారులను కలసి, బీఆర్ఎస్కు మద్దతు ఇవావలని కోరారు. ఆర్ఎంపీ వైద్యుడు పోచన్న సుమన్‌ను శాలువాతో సత్కరించి, మద్దతు తెలిపారు. మూడో జోన్ ఏరియాలో విప్ సుమన్ మటన్ షాపులో మటన్ కొట్టడంతో పాటు ఆటో నడిపి, లాండ్రిషాపులో బట్టలను ఇస్త్రీ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్, మహిళా విభాగం, యూత్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.