మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 20 : ‘చెన్నూర్ నియోజకవర్గంలో అభివృద్ధి అటకెక్కింది. సంక్షేమం పక్క దారి పట్టింది. మంత్రి వివేక్ సోషల్ మీడియా, పేపర్లు, టీవీల్లో రోత రాతలు రాయించుకుంటున్నడు. ఫ్యాక్షన్ రాజకీయాలు, నియంతృత్వపు పోకడలతో ప్రశ్నించిన వారిపై దాడులు చేయిస్తూ శునకానందం పొందుతున్నడు.’ అంటూ బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడి మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సుంకరి గోపాల్‌ను సోమవారం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్ తదితర నాయకులతో కలిసి పరామర్శించారు. బాధితుడికి ధైర్యం ఇచ్చారు.
మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ నేతృత్వంలో దుర్మార్గాలు, అరాచకాలు కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల జరిగిన క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద రాళ్ల దాడి, లాఠీచార్జి చేయించారని, 16 రోజుల పాటు జైల్లో నిర్బంధించారని, సంఖ్యాబలం లేకున్నా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కాకుండా అడుగడుగుడా ఆటంకం సృష్టంచారని మండిపడ్డారు. సుమారు 53 రోజుల పాటు ఎన్నిక జరుగకుండా మంత్రి వివేక్ ఏ విధంగా కుట్ర చేశాడో రాష్ట్రమంతా చూసిందన్నారు.

అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. చేవెళ్లలో చెప్పిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, కామారెడ్డిలో చెప్పిన బీసీ డిక్లరేషన్, వరంగల్‌లో చెప్పిన రైతు డిక్లరేషన్, సరూర్‌నగర్‌లో చెప్పిన యూత్ డిక్లరేషన్, చెన్నూర్‌లో ఎమ్మెల్యేగా గెలవడానికి సొంతంగా వివేక్ ఇస్తానన్న 45 వేల ఉద్యోగాలు, ఏర్పటు చేస్తానన్న ఫ్యాక్టరీ, అగ్రికల్చర్ మినీ యూనివర్శిటీ, సింగరేణి కార్మికులకు చేస్తానన్న లాభాలు, కరకట్టలు నిర్మాణాలు, రూ.వేల కోట్లు తీసుకవచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్న హామీలపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా, ఇతర మీడియా వేదికగా ప్రజల తరుపున ప్రశిస్తుంటే తట్టుకోలేక తమ నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారన్నారు.
భీమారంలోని కాంగ్రెస్ నాయకులు అనేక అక్రమాలు, అవినీతి పాల్పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేస్తలేదని బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సుంకరి గోపాల్ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు పది.. పదిహేను మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మద్యంమత్తులో గోపాల్‌పై దాడి చేశారని, భీమారం పట్టణం నుంచి అడవుల్లోకి లాక్కెళ్లి విచక్షణ రహితంగా కొట్టి చంపే ప్రయత్నం చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఘటనా స్థలానికి వెళ్లి గోపాల్‌ను విడిపించి తీసుకువచ్చారని, పట్టణ కేంద్రంలోకి పోలీసుల సమక్షంలో మరోసారి దాడి చేశారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు పెట్టాలని, చట్టపరంగా వారిని శిక్షించాలని పోలీస్ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు పెట్టలేదని, ఎవరినీ అరెస్ట్ చేయలేదని మంత్రి వివేక్‌కు జిల్లా పోలీస్ యంత్రాంగం ఊడిగం చేస్తుందన్నారు. చెన్నూర్‌లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, పత్తి, వడ్ల కొనుగోళ్లు లేవని, యూరియ బస్తాలు దొరకడం లేదని, మున్సిపల్ ఎన్నికల్లో సమయంలో చెన్నూర్, మందమర్రి మండలాల్లో కంకర కుప్పలు కనిపించాయని, ఇప్పుడు అన్ని మాయమైపోయాయని, అభివృద్ధి కోసం ఒక్క జీవో తీసుకవచ్చింది లేదన్నారు. ఈ విషయాలపైన ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ వారియర్స్ ప్రశ్నిస్తే మంత్రి వివేక్‌కు కోపం వస్తుందని వివరించారు.
ఈ మధ్య కాలంలో ఇందారం గ్రామంలో పార్టీ జెండా ఎగరవేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారని, దానిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెన్నూర్ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి చూపించిందని వివరించారు. ఏది ఏమైనా చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాగా బాల్క సుమన్, తన టీం ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అధికార పార్టీ ఆగడాలను ప్రశ్నించినందుకే దాడి

భీమారం, ఏప్రిల్ 19 : అధికార పార్టీ ఆగడాలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకే ఆదివారం రాత్రి తనపై దాడి చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సుంకరి గోపాల్ తెలిపారు. భీమారం గ్రామ పంచాయతీ నిధులను సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి భర్త, ఉష్కమల్ల పున్నం చందు, ఉష్కమల్ల శ్రీనివాస్‌తో పాటు మరికొందరి ఖాతాల్లోకి లక్షలాది రూపాయల నిధులు మళ్లీంచారని ఆరోపిస్తూ గత వారం నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
అదే విధంగా మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు కూడా అమలు కావడం లేదని పోస్టుల పెడుతున్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు గ్రామాస్తుల సహకారం అడిగగా, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు ఉష్కమల్ల పున్నం చందు మందు, విందు ఇచ్చి హత్య చేయాలనుకున్నారని బాధితుడు తెలిపాడు. ఆదివారం రాత్రి ఇప్పలబోగుడ నీళ్ల ట్యాంక్ వద్దకు తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టి హత్య చేయాలని చూశారని, తప్పించుకొని ఆవుడం క్రాస్‌రోడ్డు వద్దకు వచ్చినట్లు బాధితుడు తెలిపాడు.
పోలీసులు నివారించినా..
ఆవుడం క్రాస్ రోడ్డు టీ స్టాల్ వద్ద మళ్లీ పోలీస్ కానిస్టేబుళ్ల ముం దే తనపై దాడి చేశారని, పోలీసులు ఎంత నివారించినా ఫలితం లేకపోవడంతో ఎస్ఐ రాజేందర్ ఘటనా స్థలానికి వచ్చి ఇరువ ర్గాలను చెదరగొట్టారని గోపాల్ తెలిపాడు. కాగా, రాత్రి పోలీస్‌స్టే షన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన ఆవుల సురేశ్ యాద వ్,బర్ల మహేశ్, నాగరాజు, వేల్పుల శేఖర్, బోయిన మహేశ్, కొమ్ము కుమార్, సందనవేణి మల్లేశ్, కొమ్ము తరణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేందర్ తెలిపారు.