శ్రీరాంపూర్, నవంబర్ 27 : తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్, పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన మహోన్నత వ్యక్తి ఆయన అని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కొనియాడారు. గురువారం నస్పూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులతో దీక్షా దివస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించనున్న కేసీఆర్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల నుంచి 1000 మంది చొప్పున తరలిరావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ తెచ్చుడో నినాదంతో పోరాడారని, అన్ని పార్టీలను ఏకం చేసి రాజ్యాంగబద్ధంగా రాష్ర్టాన్ని సాధించి పెట్టారన్నారు. 2012 నుంచి దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయే శుభదినం నవంబర్ 29 అన్నారు. దీక్షా దివస్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీసీలకు చేసిన అన్యాయం గురించి ప్రచారం చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు విజిత్‌రావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, కేంద్ర కార్యదర్శి పానగంటి సత్తయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పొగాకు రమేశ్, ఆర్గనైజర్ అన్వేష్‌రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యర్శి మేరుగు పవన్, నాయకులు వంగ తిరుపతి, అత్తి సరోజ, హైమద్ తదితరులు పాల్గొన్నారు.