ఎదులాపురం,జనవరి10: గ్రామస్థాయిలో ఈ నెల 12లోగా గ్రామసభలు నిర్వహించి కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కంటి వెలుగు,పింఛన్లు, హరితహారం, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, తదితర అంశాలపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎంపీడీవోలతో మంగళవారం సమీక్ష నిర్వహంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. మారుమూల గ్రామా ల ప్రజలకు కంటి పరీక్షలు చేయాలని, రవాణా తదితర ఏర్పాట్లు కల్పించాలని సూచించారు.
ఆసరా పింఛన్దారు మరణిస్తే అతని భార్యకు పింఛన్ వచ్చేలా 15 రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ శ్రీజ, డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, జడ్పీ సీఈవో గణపతి, డీఆర్డీఏ కిషన్, డీసీవో శ్రీనివాస్, ఎంపీడీవోలు ఉన్నారు.