దండేపల్లి/చెన్నూర్/తాండూర్, డిసెంబర్ 7 : కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం దండేపల్లి మండలం తాళ్లపేటలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి ఆందోళనకు దిగారు. తాళ్లపేట న్యూ ఆటో యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఏడాదికి ఇస్తామన్న రూ.12వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా 66 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుసుకున్నారని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చెన్నూర్ పట్టణంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర నాన్ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు శనివారం తాండూర్ మండల ఆటో కార్మికులు బంద్ పాటించారు. తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు మహమ్మద్ హబీబ్ పాషా మాట్లాడుతూ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 15 వేల జీవన భృతి ఇవ్వాలని, రూ. 1000 కోట్లతో ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు చాంద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి కొత్త శంకర్, సహాయ కార్యదర్శి పల్లె వెంకటేశ్, కోశాధికారులు ఒరగంటి శుభాకర్, రఫీఖాన్, సలహాదారులు విద్యాసాగర్, టౌన్ అధ్యక్షుడు వాసాల సాయి, రేచిని అధ్యక్షుడు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు జపతి సతీశ్ పాల్గొన్నారు.