దండేపల్లి/లక్షెట్టిపేట, డిసెంబర్29 : మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమవుతున్నాయని, నమ్మి ఓటేస్తే రోడ్డున పడేస్తారా.. అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేటలో ఆటో యూనియన్ సంఘాల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. తాళ్లపేట ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టారు.
ఇప్పటికైనా సర్కారు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక ఆటోలు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో దండేపల్లి, తాళ్లపేట ఆటో యూనియన్ సంఘాల నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షెట్టిపేటలో ఆటో, టాటా మ్యాజిక్ వాహనాల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ శుక్రవారం సక్సెస్ అయ్యింది. స్థానిక కరీంనగర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం మీదుగా ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి, తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ అధ్యక్షు లు పేరగాని శంకర్, చిన్నయ్య, మల్లేశ్, ఖలీం, సభ్యులు శ్రీనివాస్, తిరుపతి, మోహీ న్, అలీం, సజ్జు, తిరుపతి, హైమద్, కిషన్, బాబా, డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు.