“గిరిజన జిల్లా ఆసిఫాబాద్ను మరింత అభివృద్ధి చేసి అగ్రస్థానంలో నిలపడమే నా ముందున్న లక్ష్యం. కాంగ్రెస్ 70 ఏండ్ల పాలనలో చేసిందేమీ లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం పదేండ్లలో మేము ఎంతో ప్రగతి సాధించాం. ఇచ్చిన.. ఇవ్వని హామీలను సైతం నెరవేర్చాం. ఇప్పుడు ఏ మారుమూల పల్లెకెళ్లినా అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నది. ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే మేలు జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు నాకే ఉంది. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి తీరుత.” అని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలు తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : గిరిజన జిల్లా అయిన ఆసిఫాబాద్ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని జడ్పీ చైర్పర్సన్, నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని.. కేవలం పదేండ్లలో చేసి చూపించిందన్నారు. ఏ పల్లెకెళ్లినా మా సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రగతి గురించే చర్చించుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో తనకు అన్ని వర్గాల మద్దతు ఉందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు.
కోవ లక్ష్మి : రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నాం. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని గ్రామాల్లో ప్రచారం చేశాం. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు నాకు ఉన్నాయి.
కోవ లక్ష్మి : కాంగ్రెస్ పాలన 70 ఏండ్లు సాగింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ 10 ఏండ్ల పాలన పూర్తి చేసింది. కాంగ్రెస్ 70 ఏండ్లలో చేసిందేమిటి.. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిందేమిటి.. అనేది ప్రజలు గమనిస్తున్నారు. పదేళ్లలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగింది. ప్రతి మారుమూల ప్రాంతంలోనూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నది. ప్రతి ఇంటిలోనూ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు ఉన్నారు. 70 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క అభివృద్ధి పనైనా ఉందా..? పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాం.
కోవ లక్ష్మి : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా సోమేశ్వర సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తాం, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. సోమేశ్వర సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో బాగా నడిచింది. కొన్ని కారణాల వల్ల మూతబడింది. దీనికి పునరుద్ధరన చేస్తాం. దీనితోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభిస్తాం. దీనికి సంబంధించి ఇప్పటికే స్థల సేకరణ పూర్తయ్యింది. దీనిని వీలైనంత త్వరగా పూర్తిచేస్తాం. దీని ద్వారా రైతులకు, నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతది.
కోవ లక్ష్మి : అర్ధాంతరంగా నిలిచిపోయిన గుండి వంతెనను రీ ఎస్టిమేట్ చేసి పూర్తిచేస్తా. దీంతో పాటు లక్ష్మీపూర్, తుంపెల్లి, అనార్పల్లి వంతెనలను నిర్మిస్తా. అక్కడి గ్రామాల ప్రజల రవాణా బాధలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటా. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పలు వాగులపై వంతెనలు నిర్మిస్తా. ప్రజలకు మెరుగైన రవాణా కల్పించేందుకు కృషి చేస్తా.
కోవ లక్ష్మి : ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతోపాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చాం. ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నాయి. ఏ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు తెలుసు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రజలకు బీఆర్ఎస్పై ఉన్న నమ్మకం, ఆసిఫాబాద్ ప్రజలకు నాపై ఉన్న నమ్మకమే నన్ను గెలిపిస్తుంది.