కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): టెండర్లు పూర్తయినా.. పనులెందుకు ప్రారంభించలేదంటూ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జడ్పీ అధ్యక్షుడు కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావుతో పాటు సభ్యులు పాల్గొని పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ సర్కారులో మంజూరైన పనులను ఎందుకు ప్రారంభించడం లేదంటూ సభ్యులు ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు.
ఇందుకు ఆర్అండ్బీ ఈఈ పెద్దన్న స్పంది స్తూ డిసెంబర్ 3 తర్వాత మంజూరైన పనులను నిలిపివేయాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు స్పందిస్తూ అభివృద్ధి పనులన్నీ ఒకేసారి చేపట్టడం సాధ్యకాదని, ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతోనే పనులను ప్రాధాన్యత వారీగా చేపడుతామన్నారు. అలాగే జిల్లాలో అటవీశాఖ అనుమతులు లేక నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. ఆర్అండ్బీ శాఖలో 21 పనులు, పంచాయితీరాజ్ శాఖలో 14 పనులు అటవీశాఖ అనుమలు లేక నిలిచిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఆసిఫాబాద్ మండలం సుంగాపూర్ రోడ్డు నిర్మాణాన్ని అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని, దీంతో గ్రామస్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని, పాత రోడ్డును బాగు చేసేందుకు కూడా అటవీఅధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆసిఫాబాద్ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు ఆరోపించారు. అటవీ అనుమతులు ఇవ్వకపోతే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేసామన్నారు. కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా పంటలకు నీరు అందడం లేదని, మానిక్‌గూడ వద్ద కెనాల్ కొట్టుకుపోయిందని చెప్పుకొచ్చారు. దీనిపై నీటి పారుదల శాఖ ఈఈ గుణవంత్‌రావు స్పందిస్తూ నెలలోగా పనులు పూర్తిచేస్తామని తెలిపారు.
దహెగాం జడ్పీటీసీ రామారావ్ మాట్లాడుతూ అందవెల్లి వంతెన త్వరగా పూర్తి చేయాలని, వర్షాకాలం వస్తే దహెగాం మండలానికి రాకపోకలు నిలిచిపోతాయన్నారు. జగన్నాథ్‌పూర్, పీపీరావ్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేసేలా చూడాలని కోరారు. సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. వచ్చే వేసవిలో ప్రజలు చేతి పంపుల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, అధికారులు స్పందించి ఇంటింటికీ నీరందించేలా చూడాలన్నారు.
ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల గురించి స్థానిక ప్రజా ప్రతినిధులకు సైతం తెలియజేయడం లేదన్నారు. అధికారంలో లేనివారిని, గతంలో ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కానివారిని పిలుస్తున్నారేగాని.. అధికారంలో ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులను ఎందుకు పిలువడం లేదని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవ్‌రావు మాట్లాడుతూ ప్రొటోకాల్ గురించి అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తానని, ప్రొటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా అటవీ శాఖ అధికారి టిబ్రివాల్, అన్ని మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.