ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 6: తెలంగాణ స్వరాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఆచార్య జయశంకర్ జయంతిని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆర్డీవోలు లోకేశ్వర్ రావు, కాసబోయిన సురేశ్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్తో కలిసి జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1934లో జన్మించిన జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విశేష కృషి చేశారని తెలిపారు. స్వరాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజలను చైతన్య పరిచారని, అందరితో కలిసి సమష్టిగా కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన అందించిన సేవలు ప్రతి ఒకరి గుండెల్లో నిలిచిపోయాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
సేవలు మరువలేనివి
నస్పూర్, ఆగస్టు 6 : తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ అందించిన సేవలు మరువలేనివని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్లో జయశంకర్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణ రాష్ట్ర కాంక్షతో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.