మంచిర్యాల, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ దంచికొట్టింది. నిప్పుల కుంపటిని తలపించిం ది. గడిచిన ఐదారు రోజులుగా భానుడు భగభగ మండుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 46.4, నిర్మల్ జిల్లా పెంబీలో 46.3, ఆదిలాబాద్ జిల్లా జైనథ్‌లో 46.2 డిగ్రీలతో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని రోజులుగా 46 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా వేడి సెగలు తగులుతున్నాయి. ఎండ వేడికి పలుచోట్ల ద్విచక్రవాహనాలు, కార్లలో నుంచి మంటలు వచ్చిన ఘటనలు సైతం ఉన్నాయి. మొన్నటికి మొన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతకు బస్సు టైర్లు కాలిపోయి పొగలు వస్తుంటే డ్రైవర్ అప్రమత్తమై నీళ్లు పోశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉష్ణోగ్రతలు పెరిగి, వేడి గాలులు వీస్తుండడంతో వడ దెబ్బ మరణాలు సంఖ్య పెరుగుతున్నది. మంచిర్యాల జిల్లా జన్నారంలో వడదెబ్బతో ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన కోవా కిరణ్‌కుమార్ (27) శుక్రవారం మృత్యవాత పడ్డాడు. గురువారం ఉమ్మడి జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి చనిపోయారు. మంచిర్యాల జిల్లాలో పాత మంచిర్యాల ప్రాంతానికి చెందిన దాసరి రాజయ్య (65), శ్రీరాంపూర్ ఏరియాలో ఎండీ చాంద్‌బీ (60), నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజీపేట గ్రామానికి చెందిన కౌలు రైతు కట్ట వెంకన్న(63), దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామానికి చెందిన మంద పోసాని(57) ఎండ వేడికి అస్వస్థతకు గురై మృతిచెందారు. గడిచిన రెండు రోజుల్లో ఇలా ఐదుగురు మృతి చెందడం ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు అద్దం పడుతున్నది.
ఉమ్మడి జిల్లాలో గడిచిన కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. దాదాపు 47 డిగ్రీలకు చేరువవుతుండడంతో బయటికి రావాలంటేనే జనాలు వణికిపోతున్నారు. జిల్లా మొత్తం రెడ్ అలర్ట్‌లో ఉంది. వేడి గాలులు వీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. రైతులు, ఉపాధి కూలీలు ఇబ్బంది పడకుండా ఉదయం వేళ మాత్రమే పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎండరాక ముందే తూకం వేయడం, కుప్పలు నేర్పడం చేయాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల దాటితే ఎవరూ బయటికి రావొద్దని.. సాయంత్రం 5 గంటల తర్వాతే పనులు చేసుకోవాలని చెబుతున్నారు. ఎండలో తిరిగి వాంతులు, విరేచనాలు, జ్వరం రావడం లాంటి లక్షణాలుంటే వెంటనే సమీపంలోని హాస్పిటళ్లకు వెళ్లాలని, తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

2