ఆసిఫాబాద్, నవంబర్ 8 : ‘ముఖ్యమంత్రి కేసీఆర్.. నన్ను ఆదివాసీ బిడ్డగా ఆదరించి, రాజకీయంగా ప్రోత్సహించారు.. ఆయనకు రుణపడి ఉంటా.., మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకొని, పోరాట యోధుడు కుమ్రం భీం పేరు పెట్టుకున్నాం.., నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. మరింత ప్రగతి కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి.. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలి..’ అని ఆసిఫాబాద్ అభ్యర్థి, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ప్రజలను కోరారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్ సమీపంలో గల మైదానంలో బుధవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో కోవ లక్ష్మి మాట్లాడారు.
ఆ రోజు సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో చాలా మంది ఏం వస్తుందని హేళనచేశారని పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో, ఆసిఫాబాద్‌లో ఏం జరుగుతున్నదనేది అందరూ చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలోనే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు కావడంతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఎంతో చక్కగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాలు నిర్మించుకొని ప్రజలకు పాలన అందిస్తున్నామని చెప్పారు.
అలాగే సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారన్నారు. మరింత అభివృద్ధి చెందాలంటే మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వాదించాలని కోరారు. ఆసిఫాబాద్ ప్రాంతంలోని కుమ్రం భీం ప్రాజెక్టు కాలువకు అటవీ అనుమతులతో పాటు ప్రాజెక్టు మరమత్తుల కోసం రూ.50 కోట్లు మంజూరుచేయాలని.., వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు కాలువల నిర్మాణం చేపట్టాలని.., ఆసిఫాబాద్ మండలం గుండి వాగుపై బ్రిడ్జి ఎత్తు, పొడవు పెంచినట్లు, వర్షాకాలంలోగా పూర్తి చేయాలన్న ప్రజల కోరిక నెరవేర్చాలని.., కెరమెరి మండలం లక్ష్మాపూర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను కోవ లక్ష్మి కోరారు. రోడ్లు, వంతెనల నిర్మాణానికి ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశారని, పనులు జోరుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎంపీ జీ నగేశ్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దాన్ రాథోడ్, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, సభ ఇన్చార్జి లింగంపల్లి కిషన్‌రావు, తుడందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య, కుమ్రం భీం మనువడు కుమ్రం సోనేరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, మర్సుకోల సరస్వతి, నాయకులు మల్లేశ్, మల్లికార్జున్ యాదవ్, వెంకన్న, బాలేశ్వర్‌గౌడ్, కోవ ఆరుణ, కోవ సాయినాథ్, విమలాబాయి, దుర్పదాబాయి, తారిక్, జీవన్, రాజేశ్వర్, అజయ్‌కుమార్, ఇంతియాజ్‌లాలా, అబ్దుల్‌కలాం, సల్మాన్, టాటిపల్లి అశోక్, రఫీక్ జీవని, నియోజవర్గంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.