ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 23 : ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించారని, టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ మేస్త్రీలుగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కిట్లు అందించడంతో పాటు బ్యాంకు రుణ సదుపాయం కల్పించేలా కృషి చేయాలన్నారు.
శిక్షణ సమయంలో స్టయిఫండ్ అందేలా చూడాలన్నారు. జిల్లాలో 2, 196 దరఖాస్తులు రాగా, మొదటి దశలో గ్రామపంచాయతీల పరిధిలో 992 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, రెండో దశలో 864 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, మూడో దశలో 447 దరఖాస్తుల మంజూరుకు సిఫారసు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ అశోక్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి సజీవన్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాం, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, అధికారి ప్రశాంత్, అమలు కమిటీ సభ్యులు శ్రీశైలం, మురళీ పాల్గొన్నారు.