తాండూర్: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందుస్తు అరెస్టు ( ASHA activists arreste) చేశారు. తమ న్యాయమైన డిమాండ్ సాధన కోసం తెలంగాణ ఆశా కార్యకర్తలు, సీఐటీయూ యూనియన్ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చింది. దీంతో ఆశ కార్యకర్తలను ఆదివారం తాండూర్, మాదారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ వెళ్లడానికి సిద్ధమవుతున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ డిమాండ్ల సాధనకై దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.