రెబ్బన : దుర్గా నవరాత్రి (Durga Navratri) ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి అమ్మవారిని 11 రోజుల పాటు ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించనున్నారు. కొమురం భీం జిల్లా రెబ్బన మండలం ( Rebbena Mandal ) ఇందిరానగర్ గ్రామంలో శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానంలో సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఒక్కో రోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిరి దర్శించుకునేందుకు మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, మహారాష్ట్ర, జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారని ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి తెలిపారు.
ఈసారి నవరాత్రులు ప్రతిసారి 10 రోజులు ఉండగా ఈసారి ఒకే తిథి రెండు రోజులు రావడం వల్ల 11 రోజులు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. తొలిరోజు 22న దేవార వినోద్ స్వామి భక్తులకు భవానీ మాలధారణ చేసి నియమాలను , విశిష్టతను వెల్లడిస్తారని తెలిపారు.