సమైక్య పాలనలో గుక్కెడు నీటికి గిరిజనులు ఎంత దుర్భర పరిస్థితులు అనుభవించారో ఈ దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పార, పర్ధాన్ గూడ, గోండు గూడ గ్రామాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ మూడు గూడేల్లో 140 ఇండ్లు ఉండగా.. 2014 కంటే ముందు ఇక్కడి ప్రజలు తాగు నీటికి అష్టకష్టాలు పడ్డారు. కిలోమీటర్ దూరంలో రెండు వ్యవసాయ బావులు ఉండగా.. పనులు వదిలేసుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకూ తాగునీరు తెచ్చుకోవడానికే సరిపోయేది. మగవారు బావిలోకి దిగి ప్రమాదకర పరిస్థితుల్లో ఒక్కో బిందెలో నీటిని పైకి అందించేవారు. అక్కడి నుంచి మహిళలు ఇళ్లకు తీసుకెళ్లేవారు. ఇక వానకాలంలో కలుషిత నీరు తాగి రోగాలబారిన పడేవారు. తెలంగాణ ఏర్పడి.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి బతుకులు మారిపోయాయి. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతోంది.
చిత్రంలో.. నల్లా నీరు పట్టుకుంటున్న ఈ మహిళది పార గ్రామం. మిషన్ భగీరథ పుణ్యమాని ఎంచక్కా ఇంటి వద్దే నల్లా నీళ్లు పట్టుకుంటున్నది. డ్రమ్ములో నీళ్లునిం పుకొని ఎప్పటిలాగే వ్యవసాయ పనులకు వెళ్తున్నది. నీటి కోసం కాలినడకన కిలో మీటర్ దూరం వెళ్లాల్సిన బాధ తప్పింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛజలం ఇప్పుడు ఇంటింటికీ అందుతోంది. శుద్ధజలం తాగడం వల్ల రోగాలు దరిచేరడం లేదు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ మా బాధలు తీర్చిందని, రోగాలు రాకుండా చేసిందని గిరిజనులు సంబుర పడుతున్నారు.
1, 100 గ్రామాలకు తాగు నీరు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 1100 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ప్రభుత్వం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. ఇందుకోసం సుమారు రూ. 2,400 కోట్ల దాకా ఖర్చుచేసింది. ప్రజల కష్టాలను తీర్చేందుకు ఎంతకైనా సాహసం చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ ద్వారా గిరిజన గ్రామాల్లోని తాగునీటి సమస్యలు పటాపంచలయ్యాయి.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ జలం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గూడేలు, తండాల్లో పరుగులు పెడుతున్నది. సర్కారు ఇప్పటివరకు రూ.2,400 కోట్లు ఖర్చు చేయగా.. 1,100 గ్రామాల అడవిబిడ్డల దాహం తీర్చుతున్నది. గత పాలకుల పట్టింపులేనితనంతో వ్యవసాయ బావులపై ఆధారపడి రోగాలబారిన పడిన గిరిజనం.. నేడు బీఆర్ఎస్ సర్కారు చొరవతో శుద్ధజలం తాగుతూ ఆరోగ్యంగా జీవిస్తున్నది. ఒకప్పుడు మైళ్ల దూరం అటవీ ప్రాంతాల గుండా నడిచి, ఎడ్లబండ్లు, సైకిళ్లపై నీరు తెచ్చుకున్న వారాంతా.. నేడు ఇంటి వద్దే నల్లా నీరు తాగుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్దాల గోస తీర్చిండంటూ మురిసిపోతున్నారు. మా ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని దీవిస్తున్నరు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ)
నేడు నట్టింట్లోనే నల్లా నీరు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అడవులు, కొండలు, గుట్టల మధ్య గూడేలు, తండాలు ఎక్కువగా ఉంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో అడవిబిడ్డల తాగు నీటి తిప్పలను పట్టించుకున్న నాథుడే లేకుండే. దశాబ్దాల పాటు వాగులు, ఒర్రెల్లోని చెలిమెల నీటిని తెచ్చుకొని దాహం తీర్చుకునే వారు. కలుషితమైన నీటిని తాగడం వల్ల వివిధ రకాల వ్యాధుల బారిన పడేవారు. వానకాలంలో అయితే డయేరియా, ఇతర వ్యాధులు పట్టి పీడించేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం జిల్లా పాలిట వరంగా మారింది. జిల్లాలోని అటవీ ప్రాంతాలతో పాటు ఎత్తైన కొండలు, గుట్టల మధ్య ఉన్న గ్రామాలకు సైతం శుద్ధం జలం అందిస్తున్నారు. ట్యాంకులు నిర్మించి.. ఇంటింటికీ నల్లాలు బిగించి నీరు అందిస్తున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ)
ఇంటింటికీ తాగునీళ్లస్తున్నయ్..
తాగు నీటి కోసం మేము పడ్డకష్టాలను తలుచుకుంటే కన్నీళ్లొస్తాయి. పొద్దున లేసినప్పటి నుంచి.. రాత్రి దాకా నీళ్లకోసమే తిప్పలపడేటోళ్లం. మా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేటోళ్లం. అక్కడి నుంచే నీళ్లు తెచ్చుకునే వాళ్లం. మొగోళ్లు బాయిల దిగి ఒక్కో బిందెను పైకి అందించేటోళ్లు. మేము ఇంటికి మోసెటోళ్లం. ఎండకాలమైతే ఆ బావుల్లో నీళ్లు తగ్గేటివి. ఇంటికి రెండు, మూడు బిందెల నీళ్లు మాత్రమే దొరికేవి. ఇప్పుడు నీటి కష్టాలు తీరినై. మిషన్ భగీరథ కింద ఇంటింటికీ తాగు నీళ్లు ఇస్తున్నరు. ఇందుకు సర్కారుకు మేమంతా రుణపడి ఉంటం.
– మడావి సకుబాయి, పార గ్రామం, జైనూర్ మండలం
మిషన్ భగీరథ మా బాధలు తీర్చింది
మిషన్ భగీరథ పథకం మా నీటి బాధలను తీర్చింది. మా పార గ్రామం పక్కనే పర్ధాన్గూడ, గొండుగూడ గ్రామాలు న్నాయి. మా పారా గ్రామంతో పాటు ఆ రెండు ఊళ్లకు కూడా తాగు నీళ్లు అందుతున్నయ్. ప్రతి రోజూ ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు వస్తున్నాయి. ఉదయం, సాయంత్రం పట్టుకుంటున్నం. మా తిప్పలు తీర్చిన సీఎం కేసీఆర్ సార్ను మరువం.
– కుమ్ర హసూబాయి
వంతుల వారీగా నీళ్లు నింపుకునేటోళ్లం
మిషన్ భగీరథ నీళ్లు రాక ముందు మా ఊరిపక్కన చేన్లళ్ల ఉన్న బావుల నుంచి నీళ్లు తెచ్చుకునేటోళ్లం. తెల్లవారక ముందే బావి వద్ద వరుసగా బిందెలను, కుండలను పెట్టేటోళ్లం. ఒక్కో ఇంటికి కుండెడు నీళ్లు తీసుకునేటోళ్లం. గ్రామంలో అన్ని ఇండ్లకు నీటిని సమానంగా తీసుకునేటోళ్లం. ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చి మా తిప్పలు తీర్చింది. ఇంటింటికీ కావాల్సినన్ని నీళ్లు వస్తున్నాయి.
– ఆత్రం ప్రతిక్ష, పార గ్రామం, జైనూర్ మండలం