ఆదిలాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు ఉండగా.. 592 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీప ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో కనీస సౌకర్యాలను కల్పించనున్నారు. పోలింగ్ నిర్వహణలో భాగంగా అవసరమైన సిబ్బంది వివరాలను అధికారులు సేకరించారు. రెండు నియోజకవర్గాల్లోని ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బంది 3,552 మంది అవసరమవుతారని గుర్తించిన అధికారులు ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 4,42,438 మంది ఓటర్లు ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,35,748 ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,15,835 మంది, మహిళలు 1,19,908 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో 2,06,690 ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 1,00,656, మహిళలు 1,06,031, ఇతరులు ముగ్గురు ఉన్నారు. వీరితోపాటు ఎన్నారై ఓటర్లు 12 మంది, సర్వీస్ ఓటర్లు 771 మంది ఉన్నారు. నవంబర్ 3 నుంచి పదో తేది వరకు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని నామినేషన్ల స్వీకరణ, 30 పోలింగ్ జరగనుంది. రెండు నియోజకవర్గాల్లో 592 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 290, బోథ్ నియోజకవర్గంలో 302 ఉన్నాయి. రెండు నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటును పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వారి సమీప ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు కల్పించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విద్యుత్, తాగునీరు, ర్యాంపు, మరుగుదొడ్లు లాంటి కనీస వసతులు సమకూర్చనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సిబ్బంది ఒకరోజు ముందుగానే కేంద్రాలకు చేరుకొని అక్కడ బస చేయాలి. వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
పోలింగ్ నిర్వహణకు 3,552 సిబ్బంది
ఆదిలాబాద్ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 592 పోలింగ్ స్టేషన్ల నిర్వహణ కోసం 3,552 సిబ్బంది అవసరమవుతారని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ శాఖలవారీగా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమాచారాన్ని సేకరించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ముగ్గరు సహాయ సిబ్బంది అవసరమవుతారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 1,450 మంది అవసరం కాగా వీరిలో 290 ప్రిసైడిండ్ ఆఫీసర్స్, 290 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 870 మంది ఇతర సహాయ సిబ్బంది ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో 302 ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 302 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, 906 మంది ఇతర సహాయ సిబ్బంది ఉన్నారు. వారి సమాచారాన్ని ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. అదనంగా 20 శాతం సిబ్బందిని రిజర్వులో ఉంచుతారు. పోలింగ్ సిబ్బంది సొంత నియోజకవర్గం, మండలం కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఆర్డీవో స్రవంతి, బోథ్ నియోజకవర్గానికి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చాహత్ బాజ్‌పాయ్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు.