చెన్నూర్ టౌన్ : తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ (BRS) నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ( Rajaramesh) ధ్వజమెత్తారు. పార్టీ నాయకులతో కలిసి మంగళ వారం ఆయన చెన్నూర్ కోర్టులో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 420 హామీలు, ఆరు గ్యారెంటీలను రేవంత్ రెడ్డి( Revanth Reddy) కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇవ్వాలని, మరీ ముఖ్యంగా రైతన్నలను దారుణంగా మోసం చేసిందని ధర్నా చేసినందుకు బీఆర్ఎస్ చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన 17 మంది నాయకులపై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు లాగిందని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వాగ్దానాలను ప్రజలకు బేషరతుగా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసేంతవరకు కచ్చితంగా అడుగడుగునా వెంబడిస్తామని, బీఆర్ఎస్ అధినాయకత్యం పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలూ నిర్వహించి ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటామన్నారు. సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు రామ్ లాల్ గిల్డా, ఎండీ నవాజ్, సాధనబోయిన కృష్ణ, మల్లెల దామోదర్, మంత్రి బాబు, మోతె తిరుపతి, ఐతే సురేశ్ రెడ్డి, పెద్దపోలు సాంబ గౌడ్ రెవెల్లి మహేశ్, మెడ సురేష్ రెడ్డి, బుర్ర రాకేష్ గౌడ్, షఫీ, కొప్పుల రవీందర్, భోగె భారతి, కొండపర్తి వెంకట రాజo కోర్టులో హాజరయ్యారు.