మంచిర్యాల, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉగాది సందర్భంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల్లో లోటుపాట్లున్న నేపథ్యంలో సన్న బియ్యం పంపిణీనైనా విజయవంతం చేయాలనే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే రేషన్ షాపులకు స్టాక్ సరఫరా చేశామని చెప్తున్నారు.
కొత్తగా రేషన్‌కార్డులు మంజూరై పౌర సరఫరా శాఖ పోర్టల్‌లో పేర్లున్న వారికి సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా రేషన్ డీలర్ల విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తున్నది. గతనెల వరకు రేషన్ షాపులకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యంలో కొంత బ్యాగ్‌లాగ్ స్టాక్ మిగిలింది. ఈ నెల నుంచి సన్న బియ్యం ఇవ్వనుండడంతో ప్రతి షాప్‌కు ఫుల్ అలైన్మెంట్ ఇచ్చారు. బ్యాక్లాగ్ ఉన్న దొడ్డు బియ్యాన్ని తీసుకెళ్లలేదు.
ఈ బియ్యానికి మీదే బాధ్యత అంటూ డీలర్లపైనే ఆ భారం పెట్టేశారు. వారం, పది రోజుల క్రితం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చిన అధికారులు ప్రతి రేషన్ షాపు తిరిగి ఎంత స్టాక్ మిగిలిందనే లెక్కలను నమోదు చేసుకున్నారు. ఆ బస్తాల పక్కన డీలర్లను నిలుచోబెట్టి ఫొటోలు తీసుకున్నారు. బియ్యం స్టాక్ దించినప్పుడు ఈ బియ్యాన్ని తిరిగి తీసుకెళ్తామని చెప్పినప్పటికీ ఇప్పటి దాకా ఆ బియ్యాన్ని అధికారులు తీసుకెళ్లలేదని రేషన్ డీలర్లు చెప్తున్నారు.
బ్యాక్లాగ్ దొడ్డు బియ్యానికి మమ్ములను బాధ్యులు చేయడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా వరకు షాపులను అద్దెకు తీసుకుని నడిపిస్తున్నామని, పాత స్టాక్‌కు సెక్యూరిటీ ఇచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. గతంలో కంది పప్పును డీలర్ల వద్దే ఉంచి అవి పూర్తిగా పాడయ్యాక చలాన్లు కట్టమన్నారని, ఈ బియ్యం మంచిగ ఉన్నప్పుడు చలాన్లు కట్టామంటే కడుతాం కానీ పాడయ్యాక కట్టిస్తే ఇబ్బంది అవుతుందంటున్నారు.
డీలర్ల వద్దే వదిలేసిన బ్యాక్లాగ్ బియ్యం స్టాక్లను వెంటనే తీసుకెళ్లాలని లేదా చలాన్లు కట్టించుకుని మాకు వదిలేసినా తీసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొన్ని వందల క్వింటాళ్ల బ్యాక్లాగ్ బియ్యం రేషన్ షాపుల్లోనే ఉండిపోయినట్లు తెలుస్తున్నది.
విక్రయిస్తే డీలర్లపై కేసులు
ఇప్పటి దాకా రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. ఆ బియ్యాన్ని కిలోకు రూ.10 నుంచి రూ.15 చొప్పున బయట అమ్ముతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలా దొడ్డు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసే కొందరు ప్రైవేటు వ్యాపారులు.. ఆ బియ్యాన్ని కిలోకు రూ.18 నుంచి రూ.25 చొప్పున మహారాష్ట్రకు తీసుకెళ్లి విక్రయించిన సొమ్ము చేసుకునేవారు.
తెలంగాణ రాష్ట్రంలోనే ఈ దందాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. పక్కనే మహారాష్ట్ర బార్డర్లో డెన్లు ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని తరలించుకుని పోయేవారు. అధికారులు ఎవరు తింటున్నారు సార్. అమ్మేస్తున్నారు.. ఏం చేయమంటారు అంటూ చెప్పుకొచ్చేవారు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్న నేపథ్యంలో ఆ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
ఈ విషయాన్ని అధికారులు ఇటీవల జిల్లా కేంద్రాల్లో రేషన్ డీలర్ల మండలాధ్యక్షులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. రేషన్‌షాపు చుట్టుపక్కల ఎవరైనా సన్నబియ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తే అది డీలర్ ప్రోద్బలంతో జరిగినట్లుగానే భావిస్తామని, మీ మీదే కేసులు పెడతామని అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది.
ఈ తీరుపై డీలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ చేయడం వరకే తమ బాధ్యత అవుతుందని, లబ్ధిదారులు దాన్ని బయటికి విక్రయిస్తే మమ్ములను బాధ్యులను చేయడం ఏంటని మండిపడుతున్నారు. రేషన్ బియ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులను వదిలేసి మమ్ములను బాధ్యులను చేయడం ఏంటని నిలదీస్తున్నారు.
సర్కార్ ఫ్లెక్సీలో పార్టీ పైత్యం.. ప్రారంభించింది పార్టీ లీడర్లే..
సన్న రేషన్ బియ్యం పంపిణీ నేపథ్యంలో అన్ని రేషన్ షాపుల సమీపంలో సర్కారు ఆధ్వర్యంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలపై తెలంగాణ ప్రభుత్వ లోగో ముద్రించారు. కానీ మంచిర్యాల నియోజకవర్గవ్యాప్తంగా రేషన్‌షాపుల్లో ఏర్పాటు చేసిన గవర్నమెంట్ ఫ్లెక్సీల్లో ఎంపీ వంశీకృష్ణ ఫొ టో కనిపించలేదు. పోనీ స్థానిక ఎమ్మెల్యే ఫొటోతో పాటు సీఎం, మంత్రుల ఫొటోలు ఉండి ఎంపీ ఫొటో పొరపాటున మిస్ అయ్యింది అనుకునేలానూ అది లేదు. ఫ్లెక్సీలో కలెక్టర్ ఫొటో పక్కనే మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఫొటో ముద్రించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లోగోతో రూపొందించిన ఫ్లెక్సీలో ఎంపీ ఫొటో లేకుండా డీసీసీ అధ్యక్షురాలి ఫొటో ఉండడంపై పలువురు కాంగ్రెస్ నాయకులే అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ లీడర్ల పేర్లు ఉన్నాయంటే ఏమో అనుకోవచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పలుచోట్ల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతోపాటు మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ కార్యక్రమంలో అధికార పార్టీ లీడర్లు ఇష్టారాజ్యం చేస్తున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సన్న బియ్యం పంపిణీ
ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 1: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని హడో కాలనీలో గల రేషన్ దుకాణం (6)లో మంగళవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి అందించే సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒకో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో సాయన్న, డీటీ పోచయ్య, రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రేగుంట కేశవరావు, రేషన్ డీలర్ వరలక్ష్మి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పేదలను ఆదుకునేందుకు కృషి
వాంకిడి, ఏప్రిల్ 1 : అనారోగ్యంతో బాధపడుతున్న పేదలను సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆమె మంగళవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో వాంకిడి మండలంలోని బంబార గ్రామానికి చెందిన లబ్ధిదారుడు గర్నులే నారాయణకు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, బంబార గ్రామం బీఆర్ఎస్ యువనాయకులు అశోక్, శైలేష్, తిరుపతి తదితరులు ఉన్నారు.