కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ వాంకిడి, నవబర్ 1 : ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండి నుంచి మధ్యప్రదేశ్‌కు సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తుండగా, వాంకిడి చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. రూ. 72.50 లక్షల విలువైన 290 కిలోల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకొని డ్రైవర్ బల్వీర్‌సింగ్‌ను అదపులోకి తీసుకున్నారు. జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే మొదటిసారి కాగా, స్థానికంగా కలకలం రేపుతున్నది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సరిహద్దులో ఉన్న వాంకిడి చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్ర వెపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను అడ్డుకొని పరిశీలించారు. అందులో భారీ మొత్తంలో గంజాయి బయటపడింది. మధ్యప్రదేశ్‌లోని మోరైనా ప్రాంతానికి చెందిన డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, అరబింద్ అనే వ్యక్తి గంజాయి తీసుకొచ్చేందుకు తనను రాజమండ్రికి పంపాడని, అక్కడి నుంచి గంజాయి లోడ్ చేసుకొని వస్తున్నానని తెలిపినట్లు ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 145 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, ఒక్కొక్కటి సుమారు రెండు కిలోలు ఉంటుందని, మొత్తం 290 కిలోలు పట్టుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 72.50 లక్షలు ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన అరబింద్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించినట్లు ఆయన వివరించారు. కాగా, కొన్ని నెలలుగా రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్‌కు గంజాయిని తరలిస్తున్నట్లు డ్రైవర్ వెల్లడించడం విశేషం. అరబింద్ ఒక్కో ట్రిప్పునకు రూ. లక్ష వరకు ఇస్తాడని, నెలలో రెండు.. మూడుసార్లు గంజాయిని తరలిస్తున్నానని డ్రైవర్ తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
అక్రమ దందాలపై పోలీసుల నిఘా పెరుగుతున్న కొద్దీ స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. సీనిఫక్కీలో దందా సాగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. వాంకిడి చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ గంజాయి ఘటన కూడా అదే తరహాలోనే ఉంది. పుష్పసినిమాలో పాలట్యాంకులో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసిన విధంగానే ఆయిల్ ట్యాంకర్ మధ్యలో ప్రత్యేక అరలను ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు ప్రయత్నించారు. ఇటీవల జిల్లా మీదుగా సాగుతున్న అక్రమ రవాణాలన్నీ ఇలా కొత్త తరహాలోనే సాగుతున్నాయి. గతంలో ట్రక్కులు, ఐచర్ వంటి వాహనాల్లో పశువులను తరలించే వ్యాపారులు.. ఇప్పుడు కంటెయినర్లు వాడుతుండడం గమనార్హం.