కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస గౌరవం దక్కడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపడుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకులకు ఎలాంటి ప్రొటోకాల్ లేకపోయినా& అధికారులు రాచమర్యాదలు చేస్తుండగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కనీస సభామర్యాదలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, బీజేపీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్కార్ట్‌ను తొలగించింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని ఆయా పోలీస్స్టేషన్లకు ముందుగానే ఇస్తున్నప్పటికీ ఎస్కార్ట్‌గా పోలీసులు రావడం లేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్యేలకు సమాచారం ఇస్తున్నప్పటికీ& అక్కడికి వెళ్తే కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదు.
అధికారిక కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ సభలుగా నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించగా, వివాదాలకు దారితీశాయి. ఎలాంటి ప్రొటోకాల్ లేని కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటే తనకు కనీసం ప్రొటోకాల్ ఇవ్వలేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.
కోవ లక్ష్మి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసిఫాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బీజేపీ పార్టీ నుంచి గెలుపొందిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు కూడా ప్రభుత్వం ఎస్కార్ట్‌ను తొలగించింది. సిర్పూర్ నియోజకవర్గంలో తన పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు ముందుగానే ఇస్తున్నప్పటికీ తనకు ఎలాంటి ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం లేదని ఎమ్మెల్యే హరీశ్‌బాబు ఆరోపించారు.