వ్యవసాయంలో రైతాంగానికి సాగు ఖర్చులు ఏటేటా పెరుగుతున్నాయి. కూలీల ఖర్చుతో పాటు ఎరువుల వాడకం పెరగడం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వీటిని తగ్గించేందుకు వ్యవసాయ శాఖ యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించడంతో పాటు అధిక దిగుబడి సాధించడమే లక్ష్యంగా సూచనలు, సలహాలు అందిస్తున్నది. ఇందులో భాగంగా ముందుగా 684 ఎకరాల్లో వెదజల్లే పద్ధతిలో వరి పంట వేయనుండగా, 1874 ఎకరాల్లో పచ్చి రొట్ట ఎరువును వినియోగించడం ద్వారా ప్రయోగాత్మక ఫలితాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ)
Agriculture | కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో ఏటా పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎరువులు, విత్తనాల ధరతోపాటు కూలీల ఖర్చులు, యంత్ర వినియోగపు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి. ఏటా సుమారుగా రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖ ర్చు పెరుగుతున్నది. దీనికితోడుగా అతివృష్టి లేక అనావృష్టి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఇలాంటి పరిస్థితుల నుంచి రైతులను బయటపడేసేందుకు వ్యవసాయ అధికారులు దృష్టి పెట్టారు. పెట్టుబడులు తగ్గించే విధానాలు రైతులకు నేర్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో పత్తి తర్వాత అత్యధికంగా సాగయ్యేది వరి పంట. ఈ యాసంగిలో కూడా దాదాపు 37 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దీంతో ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కొత్త విధానాలతో ఎకరాకు రూ. 5వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పంట కాలాన్ని కూడా 15 రోజుల ముందుగానే తీసుకునే వీలుంటుంది. వరి సాగులో పొలాన్ని సిద్ధం చేసి, నారుమళ్లు పెంచి నాట్లు వేసే పద్ధతిలో రైతులు తమ పెట్టుబడులతోపాటు శ్రమను కూడా పెంచుకుంటున్నారు.
నారు పెంచి, నాట్లు వేసేందుకు కూలీలను అధికంగా వినియోగించుకోవాల్సి వస్తోంది. దీంతో 15 నుంచి 20 శాతం విత్తనాలు కూడా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. నాట్లు వేసే పద్ధతిలో 10 నుంచి 15 రోజుల సమయం కూడా వృథా అవుతున్నది. దీంతో విత్తనాలు చల్లే పద్ధతిలో వరి సాగు చేస్తే కూలీల ఖర్చు తగ్గడంతోపాటు, విత్తనాల వృథా, సమయం అదనంగా వెచ్చించాల్సిన అవసరం ఉండదు. జిల్లాలో 389 మందికి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో 684 ఎకరాల్లో విత్తనాలు వెదజల్లి వరి సాగుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
రైతులు అధిక దిగుబడులపై ఆశతో రసాయన ఎరువులను విపరీతంగా వినియోగిస్తున్నారు. దీని ద్వారా ఖర్చులు అధికం కావడమే తప్పా, అధిక ఎరువుల వినియోగంతో పంటలకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదు. రైతులు రసాయన ఎరువులకు బదులుగా జీవన ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులను వినియోగించే విధంగా అధికారులు ప్రోత్సహించేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రసాయన ఎరువుల రూపంలో నేలలో వేస్తున్న భాస్వరం కరుగకపోవటంతో పంటలకు ఉపయోగపడడం లేదు.
ఈ భాస్వరం జీవన ఎరువులైన పశువుల ఎరువులతో కలిపి వాడడం వలన భాస్వరం కరిగి పంటలకు అందేవిధంగా తయారువుతుంది. ఈ విధానాన్ని రైతులకు వివరించేందుకు అధికారులు ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిని అమలు చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. ఇవే కాకుండా 849 రైతులకు చెందిన 1874 ఎకరాల్లో పచ్చిరొట్ట ఎరువుల ద్వారా వ్యవసాయాన్ని చేసేలా ప్రణాళికలు తయారు చేశారు. వచ్చే యాసంగి, వర్షాకాలపు పంటలలో ఈ విధానాలను అమలు చేయనున్నారు.