విద్యార్థుల అభ్యసన, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర సర్కారు ‘ఉన్నతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించడం, మెరుగైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్లో 28 మంది టీచర్లకు శిక్షణ ఇచ్చారు. వీరు నేటి నుంచి మూడు రోజుల చొప్పున రెండు విడుతలుగా 1,173 మంది స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో విద్యార్థులు ధారాళంగా చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటివి చేస్తారని సర్కారు భావిస్తున్నది. ఫలితంగా మెరుగైన ఫలితాలు వస్తాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉందని చూస్తున్నది.
– నిర్మల్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో 6-9వ తరగతి చదివే ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నతి’ పేరిట కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 1-5వ తరగతి వరకు గల ప్రాథమిక పాఠశాలల్లో ‘తొలిమెట్టు’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ప్రత్యేకంగా టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) ద్వారా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారు. ‘ఉన్నతి’ ద్వారా మెరుగైన, నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 1,173 మంది స్కూల్ అసిస్టెంట్లకు మూడు రోజుల చొప్పున రెండు విడుతల్లో శిక్షణ ఇవ్వడానికి డీఈవో రవీందర్రెడ్డి ఏర్పాట్లు చేశారు. తొలి విడుతగా నేటి నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు, రెండో విడుతగా సెప్టెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు శిక్షణ కొనసాగనున్నది.
జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చేందుకు ఇప్పటికే ప్రతి సబ్జెక్టుకు నలుగురు ఉపాధ్యాయుల చొప్పున 28 మందికి హైదరాబాద్లో రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీరు మంగళవారం నుంచి జరిగే శిక్షణా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు ‘ఉన్నతి’ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తారు. అలాగే ప్రధానోపాధ్యాయులకు కూడా ఇటీవలే నిర్మల్లోని పంచశీల్ కళాశాలలో మూడు రోజులపాటు శిక్షణనిచ్చారు. 6-9 తరగతులను బోధించే స్కూల్ అసిస్టెంట్ల బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి ఈ శిక్షణ ఉపయోగపడనుందంటున్నారు. విద్యార్థులు ధారాళంగా చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం వంటి లక్ష్యాలు సాధించడానికి శిక్షణ ఉపయోగపడనుంది. అన్ని సబ్జెక్టుల టీచర్లకు శిక్షణలో భాగంగా లెస్సెన్ ప్లాన్స్, మాడ్యూల్స్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. శిక్షణకు వంద శాతం ఉపాధ్యాయులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో ఉపాధ్యాయులు అమలు చేసి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి నిరంతరం జిల్లా, రాష్ట్ర స్థాయి బృందాలు పర్యవేక్షించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పదో తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి ‘లక్ష్య’ పేరిట విద్యాశాఖ మరో కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, అత్యధిక మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించడానికి చర్యలు చేపట్టనున్నారు. గత విద్యాసంవత్సరంలో అధిక జీపీఏ సాధించిన 150 మందికి పైగా జిల్లా విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ, ఆ విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం పాఠ్యపుస్తకాలతోపాటు ఉచితంగా నోటు పుస్తకాలను కూడా పంపిణీ చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు శిక్షణనిస్తూ, వారిలో బోధన సామర్థ్యాలను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మరింత రాణించే అవకాశం ఉందంటున్నారు.