దండేపల్లి, అక్టోబర్ 26: దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్‌పురి కాకో ఆలయంలో దండారీ వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. మహారాష్ట్ర, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనులు, మహిళలు సుమారు వెయ్యి మందికి పైగా తరలివచ్చి ముందుగా గోదావరి నదిలో స్నానాలు చేశారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి, కోళ్లు మేకలు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా ‘రేలా…రేలా..’ పాటలతో నెత్తిన నెమలి పింఛంతో తయారు చేసిన టోపి, కళ్లద్దాలు, భుజాన జింక తోలు, నడుముకు, కాళ్లకు గజ్జెలు ధరించి, చేతిలో కోలా పట్టుకొని తప్పెట గూళ్ల వాయిద్యాలకు, డప్పు చప్పుళ్లతో కళాకారులు చేసిన గుస్సాడీ నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈనెల 28న గుస్సాడీ దర్భార్ నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
పద్మల్‌పురి కాకో అమ్మవారిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు.ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాభివృద్ధికి రూ.36లక్షలు కేటాయించామని గుర్తు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, మాజీ వైస్ ఎంపీపీ అనిల్, నాయకులు ఉన్నారు. సీఐ నరేందర్, ఎస్ఐ ఉదయ్‌కిరణ్ అమ్మవారిని దర్శించుకున్నారు.