కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో బుధవారం భయానక వాతావరణం నెలకొన్నది. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నానికి యత్నించిన ఘటన ఆగ్రహానికి కారణమైంది. ఒక వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ చేసిన పనితో సహనం కోల్పోయిన ఆదివాసులు వారి వ్యాపార సముదాయాలను కా ల్చి బూడిద చేశారు. రోడ్డుపై నిలిపిన వాహనాలకు నిప్పు పెట్టారు.
ఈ దాడిలో దాదాపు 50కి పైగా దుకాణాలు, పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. దుకాణాలు, వాహనాలు కాలుతున్న దృశ్యాలతో మండల కేంద్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు జైనూర్ మండల కేంద్రానికి చేరుకుని పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. జైనూర్ మండల కేంద్రంలో అకస్మాత్తుగా జరిగిన ఘటనతో సామాన్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణ ప్రజలు బయటికీ రావాలంటే వణికిపోతున్నారు.
వ్యాపార సముదాయాలకు నిప్పు
తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు ఆటోలో వెళ్తున్న ఆదివాసీ మహిళపై ఆటోడ్రైవర్ లైంగిక దాడికి పాల్పడి హత్యాయత్నం చేశాడు. ప్రాణపాయ స్థితుల్లో ఉన్న ఆదివాసీ మహిళ గాయాలతో రోడ్డుపైకి వచ్చి కొంతమంది సహాయంతో ఆసుపత్రికి చేరుకున్నది. ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఈ ఘటన ఆదివాసీ వర్గాలను ఆగ్రహానికి గురి చేసింది. దీంతో రెండు రోజుల క్రితం జైనూర్ మండల కేంద్రంలో రాస్తారోకో చేసిన ఆదివాసులు బుధవారం జైనూర్ బంద్‌కు పిలుపునిచ్చారు.
బుధవారం ఉదయం వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసులు భారీ సంఖ్యలో తరలిరాగా.. ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నామని, చట్టపరంగా శిక్షిస్తామని ఆదివాసులకు వివరించారు. అయినప్పటికీ శాంతించని ఆదివాసులు జైనూర్ మండల కేంద్రంలో ఉన్న ఆటో డ్రైవర్ వర్గానికి చెందిన వ్యాపార సముదాయాలపై దాడులు చేశారు.
మూసి ఉన్న దుకాణాల తాళాలను పగులగొట్టి షాపులకు నిప్పు పెట్టారు. రోడ్లపై నిలిపి ఉన్న వాహనాలను కాల్చిబూడిద చేశారు. ఓ వర్గానికి చెందిన ప్రార్థనా మందిరంలో చొరబడి విధ్వంసం చేశారు. దీంతో ఆటో వర్గానికి చెందిన వారు కూడా కర్రలు, రాళ్లు వంటి ఆయుధాలతో ఎదురు దాడికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు జైనూర్‌కు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. జైనూర్ మండల కేంద్రాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్లపై ఎవరూ తిరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
అయినప్పటికీ ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి ఎదురైంది. సామాన్య ప్రజలు రోడ్డుపైకి రావడానికి వణికిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకోవడంతో జైనూర్ దాదాపు పది రోజులుపాటు దుకాణాలు మూసి ఉంచారు. ఆదివాసులు, ఆటో డ్రైవర్ వర్గానికి గత కొన్ని ఏండ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి నెలకొన్నది. జైనూర్ మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల ఉన్న ఆదివాసీ గ్రామాల ప్రజలు, ఆటోడ్రైవర్ వర్గానికి చెందిన ప్రజలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
– ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 4 : ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బా ధితురాలిని పరామర్శించారు. ఆదివాసీ మహిళకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆదివాసులపై రోజురోజుకూ దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జైనూర్ మండలంలో గతంలోనూ ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నట్లు గుర్తు చేశారు. అకడ జరుగుతున్న ఘర్షణలపై ప్రభుత్వం స్పందించి సమస్య పరిషారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కోరారు.
సంయమనం పాటించాలి..
– ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం
ఎదులాపురం, సెప్టెంబర్ 4 : జైనూర్‌లో జరిగిన ఘటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గౌష్ ఆలం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని, పోలీసు యం త్రాంగం కేసులను నమోదు చేసిందని, దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కారకులపై చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని తెలిపారు. సోషల్ మీడియాపై నిఘా ఉందన్నారు. జైనూర్‌లో 144 సెక్షన్ అమలులో ఉందని, ఇతర ప్రాంతాలవారికి జైనూర్‌లో అనుమతి లేదన్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తప్పు చేసిన వారికి శిక్షలు తప్పవని తెలిపారు.
ఆటోడ్రైవర్‌ను శిక్షించాలని రాస్తారోకో
కెరమెరి, సెప్టెంబర్ 4: జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై లైంగిక దాడికి యత్నించి, హత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కెరమెరి మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై బైఠాయించి బుధవారం ఆదివాసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా నేరస్తుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ నిరసనలో ఆదివాసీ నాయకులు పెందోర్ మోతీరాం, కోవ విజయ్ కుమార్, కోవ ఇందిరా, పెందోర్ రాజేశ్వర్, కుమ్రం నాణేశ్వర్, రాము, సెడ్మాకి తుకారాం, సిడాం ధర్ము, పూసం భీంరావ్ తదితరులు పాల్గొన్నారు.