ఎదులాపురం, ఆగస్టు 13 ః పేదరికం, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న మారుమూల కొలాం గిరిజనుల జీవితాల్లో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ప్రత్యేక చొరవతో మార్పు తీసుకొస్తున్నారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో సొంతింటి కలను సాకారం చేస్తున్న కలెక్టర్‌పై అభిమానం, కృతజ్ఞతతో దహిగూడ కొలాం గూడేనికి గిరిజనులు రాజర్షి గూడగా నామకరణం చేశారు.
గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పిప్పలధరి పంచాయతీ పరిధిలోని దహిగూడ(రాజర్షిగూడ)లో కలెక్టర్ రాజర్షి షా పర్యటించారు. గ్రామంలో నిర్మాణం పూర్తయిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహాలను స్వయంగా ప్రారంభించారు. డీఆర్డీవో రవీందర్ రాథోడ్, పీడీ హౌసింగ్ శంకర్, తహసీల్దార్ గోవింద్ పాల్గొన్నారు.