ఎదులాపురం, జూలై 13 : ఆదిలాబాద్ పట్టణంలో కెమికల్ అండ్ డ్రగ్స్‌ను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను టూ టౌన్ పోలీసులు ఛేదించారు. సోమవారం సాయంత్రం ఏఆర్ హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ కేసు లో ఏడుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. ఈ నెల 12 రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వాహనాల తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా సూటీపై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు ఆర్ఎంపీ వైద్యుడు సిందే జగన్నాథ్‌గా గుర్తించారు.
విచారణలో శస్త్రచికిత్సల సమయంలో మా త్రమే వినియోగించాల్సిన టర్మిన్ మత్తు ఇంజెక్షన్లను మెడికల్ ఏజెన్సీలు, మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేసి గంజాయి వినియోగదారులు, ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో సిందే జగన్నాథ్, సయ్యద్ కమరుద్దీన్తోపాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రమేష్ గౌడ్, ముషారఫ్, సమీర్, ఇర్ఫాన్ ఖాన్, ముకీద్ పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొ నసాగుతోందని తెలిపారు. ఒకో టర్మిన్ ఇంజెక్షన్ అసలు ధర సుమారు రూ.390 ఉండగా, అక్రమంగా రూ.1,500 వరకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 190 ఇన్సులిన్ సిరంజిలు, 50 టర్మిన్ ఇంజెక్షన్ బాటిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు, ఒక సూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.