గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతోందని, పల్లె ప్రగతితో గ్రామాలు మెరిసి పోతున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ గ్రామంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ నాయకుల అబద్ధపు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని, ప్రజలను ఓట్లడిగే హక్కు బీజేపీకి లేదని, ఒక్క బీఆర్ఎస్కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. సొంత స్థలం ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తామని, త్వరలో గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. దళితబస్తీలో భూములు రాని వారికి దళితబంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌లాంటి మహా నేత తమకు కూడా ఉండాలని మహారాష్ట్ర సహా అన్ని రాష్ర్టాల వారు కోరుకుంటున్నారన్నారు.
జైనథ్, ఏప్రిల్ 29 : మహాత్మగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాకారం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లతో ప్రగతిబాటన ప్రతి పల్లె మెరిసి, మురిసి పోతున్నదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడలో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతక ముందు ఎమ్మెల్యేను మండలవాసులు, నాయకులు డప్పువాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలు పచ్చని అందాలతో ఆహ్లాదం పంచుతున్నాయని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పథకాలు భారతదేశంలోనే గొప్పవని అన్నారు. అన్ని పథకాలు మావే అంటున్న బీజేపీ నాయకుల అబద్ధపు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలలో హామీ ఇవ్వని వాటిని సైతం సీఎం కేసీఆర్ అమలు చేయడం గొప్ప విషయమన్నారు. బీజేపీ సర్కారు మాత్రం నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేదల, సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. నల్లచట్టాలతో వ్యవసాయాన్ని కేంద్రం ఆగం చేసిందని గుర్తు చేశారు. చనాక-కొరాట ప్రాజెక్టుతో వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మరో 20 ఏళ్లు సీఎంగా కేసీఆరే ఉంటారని ఆకాంక్షించారు.
ఓట్లడిగే హక్కు బీజేపీ నాయకులకు లేదు..
కేంద్రంలో ఉండి ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని బీజేపీ నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఏ గ్రామాన్ని సందర్శించిన దాఖలాలు లేవన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవడం ఒకటే బీజేపీ నాయకులకు తెలిసిన విద్య అని ఎద్దేవా చేశారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందన్నారు. త్వరలోనే సొంత జాగలున్న వారికి ఇండ్లు నిర్మించి తీరుతామన్నారు. 15 రోజుల్లోగా గొల్ల కుర్మలకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామన్నారు.
దళితబస్తీలో భూములు రాని వారికి దళితబంధు ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌లాంటి మహానేత తమకు కూడా ఉండాల ని మహారాష్ట్ర సహా అన్ని రాష్ర్టాల వారు కోరుకుంటున్నారన్నారు. కాగా.. పెండల్వాడకు చెందిన మెస్రం పునాజీకి రూ. 18 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, ఎంపీపీ మార్మెట్టి గోవర్ధన్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్లు చంద్రయ్య, నిమ్మల రమేశ్‌రెడ్డి, సర్పంచ్‌లు జక్కుల నవనీత సురేశ్, విఠల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆనంద్‌రావు, ఎంపీటీసీ కాసర్ల అశోక్, ఉప సర్పంచ్ సతీశ్ పాల్గొన్నారు.