ఎదులాపురం, జూన్ 16 : పట్టపగలు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అని, ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నౌకర్ అని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు అతనికి లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు. ఇటీవల రేవంత్ రెడ్డి తనను, తన ఇంటి పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడుగు, బలహీన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేను కాబట్టే ఓర్వలేక అవమానిస్తున్నాడన్నారు.
మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి నౌకర్గా వ్యవహరించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ఒంటెద్దు పోకడలతో విర్రవీగుతున్నారన్నారు. అభివృద్ధే పరమావధిగా దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగుతుందన్న రేవంత్ రెడ్డి మాటలకు స్పందించిన ఆయన.. ఒక వేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని, రాకపోతే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడా? అని సవాల్ విసిరారు.
ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలను కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇక్కడి నేతలు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడి స్థాయి వ్యక్తికి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరో తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. తన హయాంలో నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలను సైతం అభివృద్ధి బాటలో నడుపుతున్నానని స్పష్టం చేశారు.
తన ఇంటిపేరును వక్రీకరిస్తూ చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు వస్తే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, పట్టణాధ్యక్షుడు అజయ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.