స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేండ్లలో అన్ని వర్గాలకూ సీఎం కేసీఆర్ న్యాయం చేశారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 12 వార్డుల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో శుక్రవారం ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో పరిస్థితి, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులపై ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. కాగా, పెంబిలోని విజన్ పాఠశాలలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా వివరించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ఆయనను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.
ఎదులాపురం,మే 19: త్యాగాల పునాదులపై తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన రాష్ట్రంలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని శుక్రవారం ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించారు. స్వరాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో పాటు వచ్చే ఎన్నికలకు కార్యకర్తల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు మన రాష్ట్రంలో అమలవుతుంటే, ప్రతిపక్షాలు మాత్రం విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. దీనిని తిప్పికొట్టేందుకు పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి రాక ముందు చెప్పిన మాటలు వచ్చిన తరువాత చేస్తున్న పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించిన పార్టీలు ఏం చేయలేదని, ఈ తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ చేసిన సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాహుత్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జహీరుద్దీన్, పట్టణ అధ్యక్షప్రధాన కార్యదర్శులు అజయ్, ఆశ్రఫ్, మహిళా సంఘం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూప, మమత తదితరులున్నారు.