జైనథ్, నవంబర్ 3 : ఆదివాసీ, గిరిజనుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అ న్నారు. బేల మండలంలోని సాంగ్వి, పాటగూ డ, జందా, సాంగ్వి(కే), సైద్పూర్, బోరేగావ్ దౌన, రేణిగూడ, తోయగూడ గ్రామాల్లో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో పాల్గొన్నారు. గ్రామ గ్రామాన గిరిజన మహిళలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు వీర తిలకం దిద్దారు. గూడెంలో ఎమ్మెల్యే సందడి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని గ్రామస్తులను అభ్యర్థించారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సామన్య ప్రజల గురించి ఎన్నడూ పట్టించుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్థిక వ్యవస్థను పట్టిష్టపరిచి పేదలందరికీ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేశారన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఆదుకోవాలనే సంకల్పంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన వెంటనే మ్యానిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేస్తామని తెలిపారు.
మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను, ఎమ్మెల్యేగా తనను కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, ఎంపీపీ వనిత గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, నాయకులు దేవన్న, తన్వీర్ ఖాన్, ప్రమోద్ రెడ్డి, గొడం సునీల్, పెందూర్ దేవన్న, పెందూర్ మోహన్, గేడం జగన్నాథ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.