ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 31 : కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం ఖాయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చిట్యాల్ బోరి గ్రామం నుంచి మొదలై అంకోలి, వాన్వాట్ వరకు మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. డప్పు చప్పుళ్ల నడుమ ఘన స్వాగతం పలుకుతూ ప్రచార ఘట్టాన్ని కొనసాగించారు. భారీ ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులతో ప్రచారం హోరెత్తింది. కాంగ్రెస్ అభ్యర్థులపై కోట్లు కొల్లగొడుతూ టికెట్లు అప్పజెప్పడం జరుగుతుందని, రేవంత్ రెడ్డి దళారిలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంగళవారం ప్రసంగించిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను వివరించారు. అక్కడక్కడ స్థానికులతో కలిసి మాట్లాడుతూ గ్రామాలాభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించారు. గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతూ వృద్ధుల యోగాక్షేమలను అడిగి తెలుసుకుంటూ తనదైన శైలిలో ప్రచారాన్ని చేపట్టారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చింతల్బోరి, చింతగూడ, తంతోలి సొసైటీ గూడ, సిరికొండ, అంకోలి, కొలంగూడ, అంకాపూర్, పాకిడిగూడ, చిన్న పందిరి లొద్ది, పెద్ద పందిరి లొద్ది, గూడెం లొద్ది, రామ్‌గూడ, దండారిగూడ, లోకారి చిన్న లోకారి, వాన్వట్ గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. రైతుబంధు సహాయం నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడం రైతుల పట్ల ఆ పార్టీకి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దన్నారు. కుమ్రం భీం ఆశయ సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని, అందుకు అనుగుణంగానే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఎంపీపీ గండ్రత్ రమేశ్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుమ్ర లక్ష్మీ రాజు, వైస్ చైర్మన్ బొమ్మకంటి రమేశ్, కుమ్ర లక్ష్మీవసంత్, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, నాయకులు సేవ్వ జగదీశ్, రమణ, సుదర్శన్, ఆరే నరేశ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
మామడ, అక్టోబర్ 31 : నిర్మల్ జిల్లా మామడ మండలంలోని న్యూసాంగ్వీ గ్రామానికి చెందిన వంద మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ లింగారెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఆదరించండి..
మామడ, అక్టోబర్ 31 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరుతున్నారని అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మామడ మండలంలోని బూరుగుపెల్లి జీపీ పరిధిలోని పులిమడుగు గ్రామానికి చెందిన 50 మంది బీజేపీ కార్యకర్తలు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ చంద్రశేఖర్‌గౌడ్, గాయిద్పెల్లి సర్పంచ్ రాందాస్ పాల్గొన్నారు.
ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సే..
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 31 : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా సీట్లతో గెలిచేది, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్మల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు, అధ్యక్షులు టీడీపీకి రాజీనామా చేసి పొలిశెట్టి శ్రీకాంత్, వాసవి మాత మందిర చైర్మన్ దేవరశెట్టి విజయ్‌లు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఐకే రెడ్డి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరకోట ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీధర్, మాజీ చైర్మన్ ఆమెడ కిషన్ పాల్గొన్నారు.