ఆదిలాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ) ః ఎండలు మండుతున్నాయి. సోమవారం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డు నంబర్-2 ఆవరణలో ప్రతి సోమవారం ఎడ్ల అంగడి జరుగుతుంది. ఈ అంగడికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రైతులు ఎడ్లను అమ్మడానికి, కొనుగోలు వాహనాల్లో తీసుకొస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విక్రయాలు కొనసాగుతాయి.
వందల సంఖ్యలో ఎడ్లను వాహనాల్లో తీసుకొస్తారు.. కరీంనగర్ జిల్లాతోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు తమకు కావాల్సిన పశువులను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ అంగడిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. రైతులు, పశువులకు తాగునీటి సౌకర్యం, నీడ, రైతులు సేద తీరడానికి వసతులు కల్పించాలి.
తమకు కావాల్సిన ఎడ్ల కోసం మార్కెట్ యార్డు కలియతిరిగి ఎండవేడితో అలసిపోతారు. వేడిని భరించలేక రైతులు ఎడ్లబండ్లకు కవర్లు కట్టుకుంటు ఉపశమనం పొందుతున్నారు. కనీసం మంచినీటి సౌకర్యం లేకపోవడంతో వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. మూగజీవాలు మాత్రం మండుటెండలో విలవిలలాడుతున్నాయి. పశువుల అమ్మకాలు, కొనుగోళ్లలో ఫీజు వసూలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ అధికారులు పశువుల సంతలో కనీస సౌకర్యాల కల్పించాలని రైతులు కోరుతున్నారు.