మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : “ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా.. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తా..” ఇది రేవంత్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహించి చేసిన ప్రకటన. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర సందర్భంలోనూ ఉమ్మడి జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎంల మాటలు ఉత్త ముచ్చటగానే మిగిలిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ గతేడాది బడ్జెట్లో, ప్రస్తుత బడ్జెట్లో ప్రత్యేకంగా చేసిన కేటాయింపులు ఏమీ లేవు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. గత బడ్జెట్లో మాదిరిగానే ఈసారి కూడా జిల్లాకు కాంగ్రెస్ సర్కారు మొండిచేయి చూపిందని జనం మండిపడుతున్నారు.
మంచిర్యాల జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు అంశాన్ని ఈసారి కూడా సర్కారు లెక్కలోకి తీసుకోలేదు. పక్క జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు మినీ కాళేశ్వరానికి వందల కోట్లు కేటాయించిన సర్కారు.. చెన్నూర్ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించేందుకు గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మంచిర్యాలలో లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు సాగునీరు అందించే పడ్తనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లను అసలు బడ్జెట్లోనే ప్రస్తావించలేదు. హైదరాబాద్ జనాల తాగునీరు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీరు అందించే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణకు మాత్రమే డబ్బులు విడుదల చేసి చేతులు ఎత్తేసింది. మంచిర్యాల టౌన్లో బ్యాక్ వాటర్ ప్రొటెక్షన్ వాల్ కోసం రూ.100 కోట్లు ప్రతిపాదించింది. గత బడ్జెట్లోనూ రూ.255కోట్లు అంటూ ప్రచారం చేసినా.. ఆ పనులు ఇసుమంతైనా ముందుకు కదల్లేదు. దీంతో ఈసారి కూడా నిధుల కేటాయింపు నామమాత్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని ర్యాలీవాగుకు రూ. ఒక కోటి, నీల్వాయి వాగుకు రూ.13 కోట్లు బడ్జెట్లో చూపించింది. ఇవి కేవలం ప్రాజెక్టుల నిర్వహణ కోసమే చేసింది తప్ప.. పెండింగ్‌లో ఉంటూ వస్తున్న ర్యాలీవాగు, నీల్వాయి వాగుల ఆయకట్లు స్థిరీకరణకు నిధులు ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బీఆర్ఎస్ హయాంలో చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేటలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మించింది. గత ప్రభుత్వ హయాంలో వాటికి ప్రత్యేక నిధులు కేటాయించింది. కాంగ్రెస్ గెలిచాక వాటి ఆలనా.. పాలనా చూసేవారు లేకుండా పోయారు. సిబ్బంది ఖాళీల భర్తీ, సరైన సదుపాయాల కల్పనను ఈ బడ్జెట్లో నిధులు వస్తాయనుకుంటే పెద్దగా ఇచ్చింది ఏం లేకుండా పోయింది. విద్యారంగానికి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నట్లు గతంలో చేసిన ప్రకటనలే తప్ప కొత్తగా కేటాయింపులు ఏం చేయలేదు. దీంతో అన్ని వర్గాల ప్రజలు సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. జిల్లాకు ప్రత్యేక నిధులు ఏవంటూ ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులకు నిధుల మంజూరు విషయంలో సందిగ్ధత నెలకున్నది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో జిల్లాలోని పెండింగ్, ప్రస్తుత ప్రాజెక్టుల గురిం చి ప్రత్యేకంగా ప్రస్తావించ లేదు. మహారాష్ట్ర సరిహద్దులో గల పెన్‌గంగాపై కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన చనాక-కొరాట ప్రాజెక్టు పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయాయి. 2023 ఆగస్టులో కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించింది. ప్రధాన కాలువ పనులు పూర్తికాగా.. పిల్ల కాలువల పనుల నిర్మాణానికి నిధులు కేటాయించాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 52 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టు పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కడెం ప్రా జెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉండడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో వేలాది ఎకరాలకు సాగు నీరు అందిం చే కుప్టీ ప్రాజెక్టు నిర్మాణంపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గత బడ్జెట్లో కుప్టీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగం గా భూ సేకరణ కోసం రూ.237 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది బడ్జెట్లో మంజూరు చేసిన నిధులు విడుదల చేయకపోగా.. ఈ బడ్జెట్లో కూడా మొండిచేయి చూపుతుందని స్థానికులు మండిపడుతున్నారు. గిరిజనాభివృద్ధికి తక్కువ నిధులు కేటాయించడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అబద్ధాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్న రేవంత్‌రెడ్డి అబద్ధాల ముఖ్యమంత్రిగా మార గా.. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా ఆసత్యాలతో కూడుకున్నది. ఇందిరమ్మ ఇండ్లకు నియోజ కవర్గానికి 3500 మంజూరు చేసినా దాదాపు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయి. బడ్జెట్లో కేవలం రూ.12 వేల కోట్లు మాత్ర మే కేటాయించారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి ఐదేండ్లలో రూ.1 లక్ష కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా ఈ బడ్జెట్లో కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే మంజూరు చేశారు. రైతుబంధు నిధులు రూ.12 వేల కోట్లు కేటాయించడం ఈ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. చనాక, కొరాట, ఇత ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్ తప్పుడు లెక్కలు, అసత్యాలతో కూడినది తప్ప అభివృద్ధి, సంక్షేమం దిశగా ఆలోచన చేసినట్లు కనిపించలేదు.
– మాజీ మంత్రి జోగు రామన్న
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్ ఆటో డ్రైవర్ల నుంచి అన్నదాతల వరకు అందరినీ మరోసారి మోసం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బడ్జెట్లో ఉసే ఎత్తలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలని తేలిపోయింది. ఆరు గ్యారెంటీలకు పాతరేసేలా ఉన్న ఈ బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశపర్చింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఎప్పుడు ఇస్తరో చెప్పలేదు. గత పదేండ్ల కేసీఆర్ పాలనలో వెలిగిన తెలంగాణను 15 నెలల్లోనే అంధకారంలోకి నెట్టివేసేలా ఉంది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం, చేయూత ద్వారా వృద్ధులు, వితంతులకు, బీడీ కార్మికులకు రూ.2 వేల నుంచి రూ.4వేల పెంపుపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కాంగ్రెస్ అంటేనే దగా చేసే ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నది.
– భూక్యా జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీగా ఉంది. అంచనా వ్యయానికి, వచ్చే ఆదాయానికి అసలు ఎక్కడా పొంతన లేదు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించే బడ్జెట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ముథోల్ నియోజకవర్గం చాలా వెనుకబడిన ప్రాంతం. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ నియోజకవర్గ అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేశారు. ముఖ్యంగా గడ్డెన్న వాగు ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. వాటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు బడ్జెట్లలో నయా పైసా కేటాయించలేదు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో సరిగా వసతులు లేవని రేవంత్‌రెడ్డి దొంగతనంగా గోడ దూకి నాడు డ్రామాలు చేశారు. ట్రిపుల్ ఐటీపై అంత ప్రేమ ఉంటే మరి ఇప్పుడు బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు? ప్రస్తుతం ట్రిపుల్ ఐటీలో పని చేస్తున్న వారికి జీతాలు లేక వారంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నరు. అలాగే దేశంలోనే ఎక్కడా లేని సరస్వతీ అమ్మవారి ఆలయం బాసరలో ఉంది. ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇటీవల నిర్వహించిన వసంత పంచమి వేడుకల్లో కనీస సదుపాయాలు లేక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.
– డాక్టర్ పడకంటి రమాదేవి, బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ సమన్వయకర్త
గత శాసనసభ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో ప్రకటించారు. అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో కూడా పెట్టింది. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతున్నా సీపీఎస్ రద్దు గురించి ఎలాంటి ఆలోచన చేయడం లేదు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా సీపీఎస్ రద్దు గురించి ప్రస్తావిస్తారని ఆశించాం. దానికి సంబంధించి మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
– కృష్ణారావు, పెన్షన్ ఉద్యమ నాయకులు, నిర్మల్.
కాంగ్రేస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పర్చింది. ఈ బడ్జెట్ ఏ ఒక్క వర్గానికి మేలు చేసే విధంగా లేదు. ఇచ్చిన హామీలకు సరిపడా నిధులు కేటాయించలేదు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. బడ్జెట్లో కేటాయించిన అరకొర నిధులతో ఆరు గ్యారెంటీల అమలు ఏ విధంగా సాధ్యమవుతుంది? రైతులకు సంబంధించి రుణమాఫీ పూర్తి కాకున్నా.. బడ్జెట్ ప్రసంగంలో రుణమాఫీ పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కౌలు రైతులకు భరోసా ప్రస్తావన లేదు. ఇప్పటి వరకు రెండు విడుతల్లో ఎగ్గొట్టిన రైతు భరోసా ఊసే లేదు. ఇది పూర్తిగా లోప భూయిష్టమైన బడ్జెట్. ఆదాయం ఎలా సమకూర్చుకుంటారు. రెవెన్యూ లోటు ఎంత ఉంది అన్న విషయాలను స్పష్టంగా చెప్పలేదు. విద్యా, వైద్యం, వ్యవసాయంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను విస్మరించిన ఈ బడ్జెట్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
– కే.రాంకిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త
కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్పా ఏమీ లేదు. బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. బోథ్ నియోజకవర్గ రైతులు వేలాది ఎకరాలకు సాగునీరు అందించే కుప్టీ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేదు. గతేడాది బజార్హత్నూర్ మండలంలోని పిప్రిలో పర్యటించిన ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కుప్టీ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తామని చెప్పడంతోపాటు మరో రెండు హామీలు ఇచ్చినా నిధులు మంజూరులో మొండిచేయి చూపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు రూ.1 లక్ష అదనంగా మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పినా నిధులు మాత్రం కేటాయించలేదు. ఆరు గ్యారెంటీల ప్రస్తావన లేదు. గిరిజనుల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు. నామ్‌కే వాస్తేగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రజలకు ప్రయోజనం లేదు.
– అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్.