బేల, ఆగస్టు 20 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా(బి) గ్రామస్తులు రాత్రి వేళ కరెంటును సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి రాత్రి కరెంటు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి వర్షంలో కూడా సబ్ స్టేషన్ ఎదుట గ్రామస్తులు సెల్ లైట్ల వెలుతురులో నిరసన తెలిపారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులు వచ్చి తమ సమస్యను పరిషరించే వరకు ఆందోళన విరమించమని భీష్మించుకు కూర్చున్నారు.
రాత్రి 9 గంటల వరకు కూడా సబ్ స్టేషన్ వద్దనే ఉన్నారు. సమస్య తీర్చే వరకు మండలం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మసాలా గ్రామంలో లోవోల్టేజీ సమస్య ఉందని విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదన్నారు. విద్యుత్ సరఫరా ఎందుకు చేయడం లేదంటూ విద్యుత్ శాఖ అధికారులు నిలదీశారు. చిన్నపాటి చినుకులు వచ్చినా.. గాలి వీచిన విద్యుత్ సరఫరా నిలిపి వేయడం సరి కాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందన్నా మాటే తప్ప 24 గంటల కరెంటు ఉండడం లేదన్నారు. కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో అని గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తుందని రాత్రి వేళల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మసాలా(బీ) గ్రామస్తులు పాల్గొన్నారు.