ఐచర్ వాహనం స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
ఎదులాపురం,అక్టోబర్ 12 : పట్టణంలో గతేడాది జరిగిన సిగరేట్ల దొంగతనం కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. గతేడాది అక్టోబర్ 8న బీ రా ములు కాంప్లెక్స్‌లోని ఐఏ ట్రేడర్స్ హోల్‌సేల్ దుకాణంలో ఐదుగురు నిందితులు ఐచర్ వాహనంలో వచ్చి అర్ధరాత్రి షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.8 లక్షల విలువైన సిగరెట్లు, పాన్‌మసాలా కార్టూన్లు దొంగిలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి అక్టోబర్ 31న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి , సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇన్చార్జి ఎస్పీ ఆగస్టు 21న పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ సమయంలో పెండింగ్ కేసును టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అప్పగించడంతో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు, వాహనం కోసం గాలింపు చర్య లు చేపట్టారు. సోమవారం రాత్రి అందిన సమాచారం మేరకు పట్టణ సీఐ ఎస్. రామకృష్ణ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసులతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టి ఐచర్ వాహనంను స్వాధీనం చేసుకొని సిగరేట్ల చోరీకేసులోని నాలుగో నిందితుడు మహారాష్ట్రలోని ఆహ్మద్‌నగర్ జిల్లా దారేవాడి గ్రామానికి చెందిన దానే కమలేశ్ బాలా సాహెబ్ అలియాస్ కమలేశ్ తివారీని అరెస్టు చేశారు. మరో నిందితుడిని త్వరలో అరెస్టు చేసి కేసు దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. చోరీ కేసు దర్యాప్తులో సీసీటీవీ కెమెరాలు కీలకపాత్రపోషించినట్లు తెలిపారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ ఎస్ రామకృష్ణ, ఎస్ఐలు అప్పారావు, బాల్తా స్నేహ, టాస్క్‌ఫోర్స్ ఏఎస్ఐ సయ్యద్ తాజొద్దీన్, హెడ్ కానిస్టేబుల్ దారట్ల శోభన్, కానిస్టేబుళ్లు ఎం.ఏ కరీం, ఠాకూర్ జగన్‌సింగ్, ఆడే మంగళసింగ్, కే.హనుమంతరావు, స్టేషన్ రైటర్లు కే. రాములు, ఆదిల్, రాంరెడ్డి పాల్గొన్నారు.
జిల్లాలోని దుకాణా సముదాయల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి సీసీ కెమెరాలు అమర్చుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలతో నిఘాతో భద్రతా, రక్షణ, భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.