బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు ఆ పార్టీ మద్దతుతో నడుస్తున్న రాష్ర్టాల నుంచి రైతు కూలీలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. తమ భూముల్లో పంటలు పండించుకోలేక.. చేసేందుకు పని దొరుకక.. పొట్ట చేత బట్టుకుని ఉపాధి కోసం తెలంగాణ బాట పడుతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తే.. తెలంగాణ సర్కారు రైతు పక్షపాతిగా సాగును పండుగలా మార్చింది. ప్రస్తుత వానకాలం సీజన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ పల్లెలో చూసినా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన కూలీలే దర్శనమిస్తారు. సొంత రాష్ర్టాన్ని, ఉన్న ఊరును వదిలి వస్తున్న కూలీలకు మన రైతాంగం కడుపునింపుతున్నది. అక్కడ రోజంతా పనిచేసినా రూ.200 కూలీ దొరకదని, ఇక్కడ మాత్రం రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నామని పొరుగు రాష్ర్టాల కూలీలు సంతోషంగా చెబుతున్నారు. దార్శనికుడైన నాయకుడు కేసీఆర్ సీఎంగా పరిపాలన సాగిస్తుండడంతో.. వ్యవసాయ రంగంలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చెప్పేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే తార్కాణం.
నిర్మల్(నమస్తే తెలంగాణ)/లోకేశ్వరం, ఆగస్టు 25 : ఒకప్పుడు కరువుకు మారుపేరుగా నిలిచిన ఆదిలాబాద్ జిల్లాలో కాళేశ్వరం జలాలు అనతి కాలంలోనే సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫలాలు, వర్షాకాలం, ఎండాకాలం అన్నతేడా లేకుండా గోదారమ్మ నీటితో చిందేస్తున్న చెరువులు, పంట కాల్వల్లో నీటి గలగలలు, కనుచూపు మేర ఆకుపచ్చని భూములు ఈ ప్రాంత రైతాంగ బతుకుల్లో కొత్త వెలుగులను తీసుకొచ్చాయి. సాగు నీటి ఇబ్బందులు తీరి మెట్ట, మాగాణి అన్న తేడా లేకుండా సాగు పనుల్లో తీరిక లేకుండా రైతు కుటుంబాలు గడుపుతున్నాయి. ఇక్కడి రైతన్నలు గుండె నిబ్బరంతో బతుకుతుండగా.. భరోసా కరువై ఉపాధి కోసం తెలంగాణకు వలస రావాల్సిన విచిత్ర పరిస్థితులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో నెలకొన్నాయి.
అక్కడ ఏడాదికీ ఒకే పంట..
తెలంగాణ మాదిరిగా ప్రాజెక్టులు, కాలువలు పొరుగు రాష్ర్టాల్లో లేవు. అక్కడ ఏడాదికి ఒకే పంట పండుతుంది. అది వర్షాలు సరిగ్గా కురిస్తేనే. యేటా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే వారికి పని. మిగతా రోజుల్లో పంటలు పండక, బతుకుదెరువు కోసం వెతుకులాడే దుస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన కూలీలు ఏడాదిలో ఎనిమిది నెలలపాటు తెలంగాణలోనే ఉంటూ ఉపాధి పొందుతున్నారు. పుట్టిన ఊరును, కన్నవాళ్లను వదిలి పొట్టచేతబట్టుకుని కుటుంబంతో యేటా రైళ్లు, బస్సుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తరలిరావడం తప్పనిసరిగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు రైతులకు ఆదాయం పెంపుకు బదులుగా రెండింతలు నష్టాలు చేసేవిగా ఉంటుండడం వల్లనే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ రెండు పంటలకు పుష్కలంగా నీళ్లు..
ఎనిమిదేండ్ల కిందట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి బతుకన్నదే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో ఈ ప్రాంతంలో సాగు నీటి సమస్య తీరింది. ఎటు చూసినా పొలాలతో పచ్చదనం పురుడు పోసుకున్నది. ఒకప్పుడు ఐదు లక్షల ఎకరాల్లోపే ఉన్న సాగు ప్రస్తుతం ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 19.30 లక్షల ఎకరాలకు పెరిగింది. కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంత పరిస్థితి మెరుగుపడింది. కాల్వల ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లందుతుండడంతో బీడు భూములకు సాగు కళ వచ్చింది. ఎటు చూసినా జలకళను సంతరించుకున్న చెరువులు, కాల్వలు.. పచ్చదనంతో కూడిన పంట భూములే కన్పిస్తున్నాయి. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు భీమా, పంటలకు మద్దతు ధర వంటి ఎన్నో పథకాలు తెలంగాణలో అమలవుతుండడంతో రైతు కుటుంబాలు వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నాయి. యేటా రెండు పంటలు పండించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నాయి.
వలసొస్తున్న కూలీలు 30 వేల మందికి పైనే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు సాగు చేసే ప్రధాన పంటలు సోయా, పత్తి. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అధికంగా వరిని సాగు చేస్తుండగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తి సాగవుతున్నది. వానకాలం సీజన్ ముమ్మరంగా సాగుతుండడంతో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పంజాబ్ రాష్ర్టాలకు చెందిన కూలీలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుని వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం కలుపుతీత, నాట్లు వేసే పనులు పల్లెల్లో జరుగుతున్నాయి. సోయా పంట చేతికొచ్చే దశలో ఉంది. దీంతో పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. వలస వచ్చిన వారిలో ఎక్కువగా 15 వేలకు పైగా బిహారీలే ఉంటున్నారు. ఏ గ్రామంలో చూసినా వీరే కన్పిస్తారు. వరి పంట చేతికొచ్చే నవంబరు, డిసెంబరులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 500 వరకు కొనుగోలు కేంద్రాల్లోనూ, రైసు మిల్లుల్లోనూ బిహారీలే హమాలీగా పనిచేస్తూ ఉంటారు. పత్తి ఏరివేత సమయంలోనూ వలస కూలీలకు ఉపాధి దండిగా ఉంటోంది.
జిన్నింగ్ మిల్లులు అధికంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, కుభీర్, బోథ్, ఇచ్చోడ, నార్నూర్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లోనూ ఇతర రాష్ర్టాల కూలీలే కనిపిస్తారు. పసుపు సాగయ్యే నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోనూ వలస కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. సోయా, వరి కోతలకు వినియోగించే హార్వెస్టర్ల డ్రైవర్లుగా పంజాబ్‌కు చెందిన వారే ఉంటారు. వీరికి బత్తాతోపాటు నెలకు రూ.40 వేల వరకు జీతంగా ఇస్తున్నారు. దినసరి కూలీలకు రోజుకు రూ.1000 నుంచి రూ.1500 కూలీ గిట్టుబాటవుతోంది. నెలకు ఎంతలేదన్నా రూ.25 వేల వరకు సంపాదిస్తున్నారు. తిండి ఖర్చులు పోను రూ.20 వేలను తమ సొంతూర్లలోని కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. తెలంగాణలో ఉన్న పరిస్థితులు మా దగ్గర ఉంటే ఇక్కడకు వచ్చే పరిస్థితులే ఉండేవి కావని పొరుగు రాష్ర్టాల కూలీలు ఆవేదనతో చెబుతున్నారు.
v ఇక్కడ కూలీ రేట్లు ఎక్కువే..
మా దగ్గర కూలీ గిట్టుబాటు కాదు. ఎంత కష్టం చేసినా మిగులు అనేదే ఉండదు. తెలంగాణలో కూలీ రేట్లు ఎక్కువే. అన్ని ఖర్చులు పోను నాలుగు పైసలు వెనకేసుకోగల్గుతున్నం. యేటా యాసంగిలో నిర్మల్ మండలంలోని లోకేశ్వరం ప్రాంతానికి వస్తున్నాం. కలుపుతీత నుంచి పంటలు చేతికొచ్చేదాక ఉంటాం. చేతినిండా పనిదొరకడడంతో సంతోషంగా ఉండగల్గుతున్నాం.
– అర్పల్, వలస కూలీ, మహారాష్ట్ర
సొంతవాళ్లలా ఆదరిస్తున్నరు..
పనులు లేక పొట్టచేతబట్టుకుని వస్తున్న మమ్మల్ని తెలంగాణ ప్రజలు సొంతవాళ్లలా ఆదరిస్తున్నరు. వ్యవసాయ పనుల్లో అవసరాన్ని బట్టి కొందరు మందుగానే మాకు ఫోన్ చేసి పిలుపు పిచ్చుకుంటున్నరు. అడ్వాన్స్‌గా డబ్బులు ఇవ్వడమే కాదు. ఏదైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు సర్దుబాటు చేస్తున్నరు. వసతి, భోజన సదుపాయం కల్పించి కడుపులో పెట్టి చేసుకుంటున్నరు.
– మహేశ్, వలస కూలీ, బిహార్
కేసీఆర్‌కు సలాం..
మాది ఉత్తరప్రదేశ్‌లోని పిలిపి గ్రామం. నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పంటలు వేద్దామంటే నీళ్లు ఉండవాయె. ఏటా భూములను పడావు పెట్టి ఆదిలాబాద్ జిల్లాకు ఉపాధి కోసం వస్తున్నాం. మా దగ్గర కూలీ రెండొందలే. ఇక్కడ రోజుకు రూ.1000 పైనే సంపాదించుకుంటున్నం. దర్జాగా బతుకుతున్నం. తెలంగాణకు వచ్చి ఎవరైనా బతుకొచ్చు. మా రాష్ట్రంలో పరిస్థితులు గిట్ల లేవు. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– రాహుల్ సింగ్, వలస కూలీ (ఉత్తరప్రదేశ్)