బేల/భైంసా, ఆగస్టు 25 : శ్రావణమాసం ముగింపులో బహుల అమావాస్య రోజున వచ్చే పొలాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ప్రకృతిని పూజించడంతో పాటు వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించే ఎద్దులను అందంగా సింగారించి , ఆరాధించే అరుదైన పండుగ ఇది. వ్యవపాయ పనులు పూర్తైన క్రమంలో వచ్చే తొలి పండుగ కావడంతో రైతులు, కొన్ని సామాజిక వర్గాల ప్రజలు పొలాల అమావాస్యను అత్యంత అట్టహాసంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇతర పండుగలతో పోల్చితే ముచ్చటగా మూడు రోజుల పాలు జరుపుకునే పొలాల పండుగలో సామాజిక అంశాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడతాయి. చెరువు మట్టితో ఎద్దులు, గురుగు (ప్రమిద)లను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజించి నిండుగా ఉన్న చెరువులో నిమజ్జనం చేస్తుంటారు.
ఎడ్లను పూజించే పండుగ..
శ్రావణమాసంలో వచ్చే చివరి పండుగగా గ్రామీణులు భావిస్తారు. గూడేలు, పల్లెల్లో అత్యంత ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం రైతులు అటవీ ప్రాంతానికి వెళ్లి ప్రకృతిలో విరబూసిన జంజేరు పూలు, పత్రి ఆకులు, నా తీసుకువచ్చి తోరణాలు తయారు చేసి ఇంటి గుమ్మాలకు కడతారు. వేద పండితుడు, కుల గురువులను ఇంటికి ఆహ్వానించి కాళ్లు కడుగుతారు. పితృ దేవతలకు బియ్యం.. ఇతర నిత్యావసర వస్తువులు అందజేసి రుణం తీర్చుకుంటారు. మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి పూజించి, ఉపవాస దీక్షను విరమిస్తారు. ఎద్దులను చెరువులు, వాగుల్లో శుభ్రంగా కడిగి ఇండ్లకు తీసుకువస్తారు. వాటి వీపు పై రంగు రంగుల బొమ్మలు వేసి, మెడలో గంటలతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. గుడిచుట్టూ ఐదుసార్లు ఎద్దులతో ప్రదక్షిణ చేయిస్తారు. గ్రామ పటేల్ తోరణం తెంపితేగానీ ఎడ్లజతలు గ్రామాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండదు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఎడ్లకు నైవేద్యంగా..
ఆలయాల్లో ప్రదక్షిణ అనంతరం ఇంటికి తీసుకువచ్చిన ఎడ్ల జతలకు రైతులు పూజలు చేసి ఆ రోజు చేసిన వంటకాలను నైవేద్యంగా తినిపిస్తారు. అనంతరం కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం ఆరగిస్తారు. ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఆచారంగా పెద్దలు చెబుతున్నారు. ఎద్దులు లేని రైతులు కూడా తమ బంధువుల ఎడ్ల జతలను తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు.
శనివారం బడిగా పండుగ..
పొలాల అమావాస్య మరుసటిరోజు బడిగా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. శ్రావణమాసంలో నెల రోజుల పాటు మాంసాహారాన్ని భుజించకుండా నియమ నిష్టలు పాటించిన వారు శనివారం బడిగను జరుపుకుంటారు. అనంతరం మాంసాహరం స్వీకరిస్తారు. ఈగలు, దోమలు, రోగాలు తీసుకుపోరా బడిగా అంటూ ఇంట్లో నుంచి కేకలు వేస్తూ గ్రామ పొలిమేరకు బయలుదేరుతారు. అక్కడ జమ్మిచెట్టుకు పూజలు చేసి కలిసికట్టుగా నైవేద్యం ఆరగిస్తారు. ఆ రోజు నుంచి ఈగలు, దోమలు, వ్యాధుల పారిపోతాయని వారి నమ్మకం.
మూడో రోజు నిలు..
పండుగ వేడుకల్లో మూడో రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. మద్యం, మాంసాహారం ముట్టకుండా భక్తి ప్రవత్తులతో ఉంటారు. అందుకు మూడో రోజును నిలు అని పిలుచుకుంటారు. బడగ రోజు ఆనందంగా ఆడిపాడి అలసి పోయి నిలు రోజున పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు.
నాల్గోరోజు గురుగులంపడం..
అమావాస్య కార్యక్రమాల్లో చివరి (నాల్గో) రోజు మా త్రం మహిళల భాగస్వామ్యం ఉంటుంది. ఉదయం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు ప్రత్యేకంగా మట్టి తో ప్రమిదలను తయారు చేసి, ఆడబిడ్డలు గ్రామ శివారు ప్రాంతంలోని చెరువుకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అక్కడే మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇంటికొచ్చిన తర్వాత చీకటయ్యాక మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య దండారి, కోలాటం ఆడుతారు. ఇలా సంస్కృతీ సంప్రదాయాల కలబోతతో ప్రకృతిని, పశువులను పూజించి, ఆరాధించడం పొ లాల ఆమావాస్య పర్వదిన వేడుకల్లో మాత్రమే కనిపిస్తున్నది.