నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు మరో పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. రైతులకు మాదిరిగానే చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాలకూ బీమా అందించనున్నది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న లాంఛనంగా ప్రారంభించనున్నది. 18 నుంచి 60 ఏండ్లలోపు వారంతా అర్హులుగా ప్రకటించగా, ఒక్కొక్కరికీ రూ. 2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనున్నది. దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందించి ఆర్థిక భరోసానివ్వనున్నది. కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా తమ కోసం పథకాలు తీసుకొస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని కార్మిక లోకం స్పష్టం చేస్తున్నది.
మంచిర్యాల (నమస్తే తెలంగాణ)/కాగజ్‌నగర్, ఆగస్టు 2 : నేతన్నల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ సర్కారు చేనేత, మరమగ్గాల కార్మిక కుటుంబాల కోసం ‘నేతన్న బీమా పథకం’ అమల్లోకి తెస్తున్నది. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం రోజున లాంఛనంగా ప్రారంభించనున్నది. 18 నుంచి 60 ఏండ్ల వయస్సులోపు వారందరూ ఈ పథకానికి అర్హులు. ఈ మేరకు చేనేత, జౌళీశాఖ మంత్రి కేటీఆర్ జౌళీశాఖకు సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఒక్కో కార్మికుడికి ప్రభుత్వమే రూ.2,271.50 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి బీమా సౌకర్యం కల్పించనున్నది. దురదృష్టవశాత్తు కార్మికుడు చనిపోతే రూ.5లక్షల బీమా పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేస్తుంది.
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో..
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్, నెన్నెల, హాజీపూర్ మండలాల్లో నేత కార్మిక కుటుంబాలు అధికంగా ఉన్నాయి. చెన్నూర్ మండలకేంద్రంతో పాటు కోటపల్లి మండలం కొల్లూరు, హాజీపూర్ మండలం, నెన్నెల మండలంలోని కుశ్నపూర్ గ్రామంలో పలువురు నేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. కాగా, జిల్లాలో చెన్నూర్ మండల కేంద్రంలో చేనేత సహకార సొసైటీ ఉంది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌లో పలు కుటుంబాలు నేత వృత్తి చేస్తున్నాయి. ఇక్కడ 40 మంది పురుషులు, 15 మంది మహిళలు చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. హాజీపూర్ మండలంలో దాదాపు 20 మంది, నెన్నెల మండలంలోని కుశ్నపల్లిలో 15 నేత కుటుంబాలు ఉన్నాయి. 1984లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని చేనేత పరిశ్రమను కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామ పంచాయతీకి తరలించి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 25 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా, చేనేత, మరమగ్గాల కార్మికులతో పాటు అనుబంధ పరిశ్రమలైన డైయింగ్, వార్పిన్, సైజింగ్, వైపనీ కార్మికులందరికీ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలన్న మంత్రి ఆదేశాల మేరకు చేనేత జౌళీశాఖ కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే అనేక పథకాలు..
కాగజ్‌నగర్, ఆగస్టు 2 : చేనేత కార్మికులకు నేతన్న బీమా పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికులకు అండగా నిలుస్తున్నది. చేనేత చేయూత పథకం, చేనేత మిత్ర పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ పథకాలతో కార్మికులకు మేలు జరుగుతుంది. అంతేగాకుండా నూతనంగా నేతన్నకు బీమా ఇన్సూరెన్స్ పథకం అమల్లోకి రానున్నది. ఈ పథకం కింత కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షలు అందనున్నాయి. చేనేత కార్మికుల బాగోగుల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదములు.
– నల్లా కనకయ్య, చేనేత కార్మిక
పారిశ్రామి సంఘం సెక్రెటరీ, కాగజ్‌నగర్
ఇది మంచి నిర్ణయం
నెన్నెల, ఆగస్టు 2 : నేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. పింఛన్ సౌకర్యం కూడా కల్పించింది. రైతులకు ఇస్తున్నట్లు మాకు కూడా బీమా పథకాన్ని తీసుకొస్తున్నారు. మాలాంటి పేద కార్మికుల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నరు. ఇందుకు వారికి ధన్యావాదాలు.
– లిక్కి శంకరయ్య, నేత కార్మికుడు, సహకార సంఘం అధ్యక్షుడు, కుశ్నపల్లి , నెన్నెల మండలం
గత ప్రభుత్వాలు పట్టించుకోలే..
కాగజ్‌నగర్, ఆగస్టు 2 : 30 ఏళ్లుగా చేనేత కార్మికుడిగా పనిచేస్తున్న. గతంలో ఏ ప్రభుత్వం కూడా మా గురించి పట్టించుకోలే. ఇది వరకు ఏ సర్కారోళ్లు అందించని పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది. ఇది గొప్ప విషయం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ నాకు వస్తున్నది. ఇప్పుడు నేతన్నకు బీమా పథకం తీసుకురావడం వల్ల పేద కార్మిక కుటుంబాలకు భరోసాగా ఉంటుంది.
– మంచికట్ల కనకయ్య, చేనేత కార్మికుడు, కాగజ్‌నగర్
కుటుంబానికి భరోసా
కాగజ్‌నగర్, ఆగస్టు 2 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే నేతన్నకు బీమా ఇన్సూరెన్స్ పథకం వాళ్ల కుటుంబానికి భరోసా కల్పిస్తున్నది. రెక్కాడితేగానీ డొక్కాడని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుంది. అదే మాదిరిగా మాకేమైన జరిగితే మా కుటుంబాలు రోడ్డున పడకుండా నేతన్నకు బీమా పథకం ఆదుకుటుంది. చేనేత కార్మికుల కోసం పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము.
– తాళ్ల రాజయ్య, చేనేత కార్మికుడు, కాగజ్‌నగర్
సర్కారు అండగా ఉంటుంది
చెన్నూర్ రూరల్, ఆగస్టు 2 : మేం చెన్నూర్‌లోని పద్మనగర్‌లో ఉంటున్నం. 40 సంవత్సరాలుగా మరమగ్గాలే నేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న. నాకు కొడుకు, నలుగురు ఆడపిల్లలు ఉన్నరు. ముగ్గురు బిడ్డలకు పెండ్లిళ్లు చేసిన. కొడుకు చిన్న దుకాణం నడిపిస్తున్నడు. ఇంకా ఇద్దరు పెళ్లికి ఉన్నరు. నా భార్య అంజలి మూడేళ్ల కింద చనిపోయింది. మాలాంటి నేత కార్మికులకు సర్కారు అండగా నిలుస్తూనే ఉంది. ఇప్పటికే పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్నది. ఇప్పుడు నేతన్న బీమా పథకం కూడా తీసుకు వస్తున్నది. ఇందుకు టీఆర్ఎస్ సర్కారుకు మేమంతా రుణపడి ఉంటాం.
– వొల్ల శంకరయ్య, నేత కార్మికుడు, పద్మనగర్, చెన్నూర్, మంచిర్యాల జిల్లా