కడెం, జూలై 27: బాలల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు దేవయ్య పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలాన్ని బుధవారం తహసీల్దార్ గజానన్, అధికారులతో కలిసి సందర్శించారు. వరదల వల్ల జరిగిన నష్టాన్ని వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలతో ఉపాధి, ఇల్లు కోల్పోయిన కుటుంబాల పరిస్థితుల ద్వారా చిన్నారుల చదువులకు ఆటంకం కలుగుతున్నందున వారికి అండగా నిలుస్తామని పేర్కొన్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు కడెం ప్రాజెక్టు,గ్రామాలను ఆయన సందర్శించారు. ప్రాజెక్టు గేట్ల వద్ద ప్రమాదకరంగా ఉన్న గోడకు రక్షణగా తీగలను అడ్డుగా ఏర్పాటు చేయాలని, నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనదారులు, పర్యాటకులు, చిన్నారులు చూడడానికి వచ్చి పడిపోయే ప్రమాదం ఉన్నందున రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ వహిద్, డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీవో శ్రీలత, సీడీపీవో శ్రీలత, అధికారులు స్వదేశ్, సైమన్, అనిల్, డీఈ భోజాదాస్, ఆర్ఐ రాజన్న ఉన్నారు.
బాలల హక్కులపై అవగాహన పెంచుకోవాలి
లక్ష్మణచాంద, జూలై 27 : బాలల హక్కులపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అరికెల దేవయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలో డీఆర్డీవో విజయలక్ష్మితో కలిసి పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలిన బాధితుడు తిక్కన్న కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
మండలంలో వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని నాయకులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలం కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థినులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి బాలల హక్కులపై అవగాహన కల్పించారు. విద్యాలయంలోని వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, సర్పంచ్ సురకంటి ముత్యం రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
నిర్మల్ టౌన్, జూలై 27 : నిర్మల్ జిల్లాలో బాలల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతోనే పర్యటిస్తున్నామని బాలల పరిరక్షణ కమిటీ కమిషన్ సభ్యుల తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం నిర్మల్‌కు వచ్చిన కమిషన్ సభ్యుడు అరికెల దేవయ్య కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.