ఆదిలాబాద్ రూరల్, జూలై 27: పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బుధవారం అత్యవసర సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని కౌన్సిల్ ఆమోదం మేరకు ఆయా కాలనీలకు నిధులు మంజూరు చేయనున్నట్లుమ తెలిపారు.
ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బంగారుగూడలోని ఇళ్లలోకి నీరు చేరడంతో కాలువల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. కిసాన్ చౌక్‌లో కాంస్య విగ్రహం ఏర్పాటు, బుద్ధిస్ట్ శ్మశాన వాటికకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రూ.15కోట్లు మంజూరు చేశారని, మరో రూ.70 కోట్ల కోసం ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపించినట్లు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించి కౌన్సిల్ ఆమోదం తీసుకున్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.