జైనథ్, జూలై 12 : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సాత్నాల ప్రాజెక్టులోకి 19వేల క్యుసెక్కుల వరద చేరగా మంగళవారం మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేసినట్లు సంబంధిత ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 19వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. పెన్‌గంగానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. పెండల్వాడ, డొల్లారా, సాంగ్వి సరిహద్దు గ్రామాలను తహసీల్దార్ రాఘవేంద్రనాథ్ పరిశీలించారు.
‘పారేఖాతి’ పరవళ్లు
నార్నూర్,జూలై 12: నార్నూర్ మండలం మాన్కాపూర్ శివారులోని పారేఖాతి జలపాతం పరువళ్లు తొక్కుతూ కనువిందు చేస్తున్నది. ఓ పక్క పచ్చని అడవి.. మరో పక్క నీటి సవ్వడులు మైమరిపిస్తున్నాయి. ఐదు రోజులుగా ముసురుతో భారీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరదతో జలపాతం పరవళ్లు తొక్కుతున్నది. మంగళవారం జలపాతం వరదనీటితో కనువిందు చేసింది.
మత్తడి వాగు గేట్లు ఎత్తివేత
తాంసి, జూలై 12 : మండలంలోని వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేర డంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు ఉండగా ప్రస్తుతం 276.1మీటర్లు ఉంది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 4300 క్యూసెక్కులు ఉండగా అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో ఉంది. వరద ఇలాగే ఉంటే 5 గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు.
‘కుంటాల’ సందర్శన నిలిపివేత
నేరడిగొండ, జూలై 12 : భారీ వర్షాల కారణంగా కుంటాలకు వచ్చే పర్యాటకులకు సందర్శన నిలిపివేస్తున్నట్లు ఎఫ్ఆర్వో వాహబ్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. జలపాతం వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండాజిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.