నిర్మల్ అర్బన్, జూలై 9 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో వరద ప్రభావితమైన ప్రాంతాలైన శాంతినగర్, శాస్త్రినగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ్ నగర్, బుధవార్‌పేట్ హరిజన వార్డు, డాక్టర్స్ లేన్‌లో మంత్రి పర్యటించారు. వరద నిలిచిన ప్రాంతాలు, నాలాలను పరిశీలించారు. తాజా పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు, మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో ఎలాంటి నష్టం జరుగకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యుత్ ప్రమాదాలతో జాగ్రత్త..
నిర్మల్ టౌన్, జూలై 9 : వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా విద్యుత్‌శాఖాధికారి జయంత్‌రావు చౌహాన్ సూచించారు. వేలాడుతున్న విద్యుత్ తీగలతో పాటు ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా ప్రమాదం ఉన్నట్లు గుర్తిస్తే విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
ప్రాజెక్టుల గేట్ల ఎత్తివేత..
వరదల వల్ల ప్రాజెక్టుల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటి పారుదలశాఖ ఈఈ రామారావు తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటికే గడ్డెన్నవాగు, స్వర్ణవాగు, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
వరద ప్రాంతాల్లో పర్యటన..
భైంసా, జూలై 9 : ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం వేర్వేరుగా పర్యటించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు రాము, కలెక్టర్ వెంట ఆర్డీవో లోకేశ్వర్ రావు, సీఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.
జిల్లా అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్
నిర్మల్ టౌన్, జులై 9 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతున్నదని, చెరువులు అలుగుపోస్తున్నందున పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. విద్యుత్, రెవెన్యూ, ఆర్అండ్బీ శాఖల అధికారులు సమన్వయంతో నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 18004255566 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
పోలీస్ యంత్రాంగం అప్రమత్తం: ఎస్పీ
నిర్మల్ అర్బన్, జూలై 9 : భారీ వర్షాలు కురుస్తున్నందున పురాతన ఇండ్లు, గుడిసెల్లో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నదీతీర, ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు తమ స్టేషన్ పరిధిలో పర్యటించాలని సూచించారు. రోడ్లు తెగిపోయిన ప్రాంతాల్లో బారికేడ్లు, ప్లాస్టిక్ కోన్స్, త్రెడ్ తదితర పరికరాలను అమర్చాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.