
సోన్, సెప్టెంబర్ 4: పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా డబు ల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలో రూ. 3.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 71 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఐకేరెడ్డి కాలనీగా నామకరణం చేసిన స్వాగత తోరణంతో పాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ సామాజిక వర్గాల గృ హాల యజమానుల ఇండ్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంత్రి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసిన మంత్రి ఇంటి యజమానిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆనందాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. పేదింటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రికి ప్రజలందరూ కూడా అంకితభావంతో ఉండి ఆదరించాలని కోరారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందించి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని, అందుకే విశాలమైన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్లు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఎలాంటి ఇండ్లు ఇచ్చాయో మనందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. ప్రభుత్వం గొప్ప సంకల్పంతో పైసా ఖ ర్చు లేకుండా ఒక్కో ఇంటికి రూ. 5.50 లక్షలను ఖర్చు చేసి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. లబ్ధిదారుల ఎంపికను కూడా పారదర్శకంగా పూర్తి చేసినట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు 3761 ఇండ్లు మంజూరు కాగా, నిర్మల్ పట్టణంలోనే 2200 ఇండ్ల నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు.
మిగతా గ్రామాల్లో 1500 ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని చోట్లా పనులు పూర్తి చేసి అర్హులకు అందిస్తామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకున్నా చిట్యాల్‌లో పనులు సకాలంలో పూర్తి చేసి మోడల్‌గా తీర్చిదిద్దుతున్న సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. చిట్యాల్ గ్రామంలో ఆధునాతన వసతులతో అందమైన భవనాలు, ఆహ్లాదకరమైన వాతావరణం లో నిర్మించేందుకు కృషి చేసిన సర్పంచ్ ఏది అడిగినా కాదనలేమని, మరో 20 ఇండ్లను వెంటనే ప్రారంభించుకోవాలని మంజూరు కూడా ఇచ్చినట్లు చెప్పారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు చెప్పారు. నిర్మల్ జిల్లాలో దసరా నాటికి మరో వెయ్యి ఇండ్లు లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సామూహికంగా నిర్వహించిన సత్యనారాయణస్వామి పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ఆర్డీవో రమేశ్ రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ తుకారాం, జిల్లా హౌసింగ్ పర్యవేక్షణాధికారి శ్రీనివాస్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మద ముత్యంరెడ్డి, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీగారి రాజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్‌రావు, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీనారాయణ, నిర్మల్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ పొలాస మల్లేశ్ యాదవ్, తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో సాయిరాం, ఉప సర్పంచ్ చిన్న య్య, ఎంపీటీసీ రాజవ్వ, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల కన్వీనర్ ముత్యంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ విజయ్‌శేఖర్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మంత్రి ఘనస్వాగతం
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి గ్రామ సర్పంచ్ రమేశ్‌రెడ్డి, గ్రామస్తులు ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుంచి డబుల్బెడ్రూం ఇండ్ల వరకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి పటాకులు పేల్చారు. ఇండ్లను ప్రారంభిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారుల పిల్లలు ఇండ్లపై నుంచి పూలవర్షం కురిపించారు.
గల్ఫ్‌లో ఉన్న నా భర్త సంతోషపడ్డడు..
సోన్/నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 4: నా పేరు దొర శోభారాణి. గౌడ కులస్తులం. ఇక్కడే కల్లు వృత్తిని నిర్వహించుకుంటూ జీవనం సాగించేవాళ్లం. వృత్తి సరిగా లేకపోవడంతో మా ఆయన సంతోష్‌గౌడ్ రెండేళ్ల క్రితం దుబాయికి బతుకుదెరువు కోసం పోయిండు. నేను బీడీలు చేస్తూ అద్దె ఇంట్లోనే ఉంటున్నా. నెలకు రూ. వెయ్యి అద్దె చెల్లించేదాన్ని. మాకు ఇద్దరు పిల్లలు. పెరిగి పెద్దగా అవుతున్నారు. చేసిన కష్టం పొట్టకూటికే సరిపోవట్లేదు. ఈ రోజుల్లో ఇల్లు నిర్మించుకునేంత స్థోమత కూడా లేదు. డబుల్బెడ్రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసిన్రు. ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉన్న మా ఆయనకు చెప్పగానే చాలా సంతోష పడిండు. ఇగ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దుకుంటం.
బట్టపొట్టకే సరిపోయేది..
సోన్/నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 4: నా పేరు మిరుగోజి కమలాబాయి నర్సయ్య, మా ఆయన వడ్రంగి పని చేస్తడు. రోజు కూలీ కింద పని చేస్తే రూ. 400 కైకిలు వస్తది. నెలలో 15 రోజులు మాత్రమే పని దొరుకుతది. మిగతా 15 రోజులు ఇంటి కాడనే ఉండాలె. చేసిన కష్టం డబ్బులతో బిడ్డను పదోతరగతి వరకు చదివించినం. సొంత ఇల్లు లేకపోవడంతో కిరాయికి ఉంటూ నెలకు రూ. 1500 అద్దె కడుతున్నం. ఇల్లు, స్థలం కొందామంటేనే ఈ రోజుల్లో రేట్లు ఏడికో పోయినయ్. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇల్లు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇయ్యాల్నే డబుల్ బెడ్రూం ఇంటికి వచ్చినం. ప్రభుత్వం ఇచ్చిన ఈ ఇల్లు మంచిగున్నది.
ఇంటికి యజమానులయ్యాం..
నా పేరు వడ్డిగ భూమవ్వ. నాకు చిన్నప్పుడే పెండ్లయింది. కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నం. అప్పటి నుంచి అమ్మ వద్దనే ఉంటున్న. 50 ఏళ్ల నుంచి చిట్యాల్లోనే తమ్ముడి వద్ద అమ్మతో కలిసి ఉంటున్న. నాకు పిల్లలు లేరు. ఒంటరిగా ఉన్న నాకు ఒక ఇల్లు నిర్మించుకుందామన్న ఆశ ఉన్నప్పటికీ, నేను పడ్డ కష్టానికి కట్టే స్థోమత లేక ఎన్నోసార్లు బాధపడిన. ఇప్పుడు డబు ల్బెడ్రూం ఇల్లు ప్రభుత్వమే మంజూరు చేసి ఇచ్చింది. నాకు పింఛన్ కూడా ఇస్తున్నది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక ఇంటికి యజమానురాలిని అయ్యాననే సంతృప్తి కలిగింది.
12 ఏళ్ల క్రితం చిట్యాల్‌కు వచ్చాం..
నా పేరు కొండా స్వరూపరాణి. మా ఆయన జీవన్‌రావు. మాది లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామం. చిట్యాల్ గ్రామానికి 12ఏండ్ల క్రితం వచ్చాం. ఈ గ్రామంలో రూ. 3వేలతో ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాం. మా ఆయన ఆటో నడుపుతున్నాడు. వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులకే సరిపోతలేవు. మాకు ఒక పాప, బాబు ఉన్నారు. ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ధర్మోరా గ్రామం నుంచి 12 ఏళ్ల క్రితం వచ్చి ఇక్కడనే స్థిరపడి ఉండి ఇంటి స్థలం, ఇల్లు నిర్మించుకుందామంటే అంత స్థోమత లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇల్లు కట్టి ఉచితంగా అందించినందుకు చాలా సంతోషంగా ఉంది.
పూజలు చేస్తూ.. సంతోషంతో పొంగిపోతూ..
ఇంట్లో పూజలు చేస్తున్న ఈ దంపతుల పేరు లావణ్య శ్రీనివాస్. సొంతింటి కల నెరవేరడంతో సత్యనారాయణ స్వామి పూజను నిర్వహిస్తున్నారు. లావణ్య గృహిణి కాగా, శ్రీనివాస్ స్థానికంగానే టైలర్ వృత్తిని నిర్వహిస్తున్నాడు. లావణ్య అత్తామామలు కూడా వీరితోనే ఉంటారు. టైలర్ పనితో వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ అనేక ఇబ్బందులు పడేవారు. ప్రతినెలా రూ. 1000 అద్దె చెల్లించడం భారంగా ఉండేది. ఈ రోజుల్లో టైలర్ వృత్తి అంతంత మాత్రంగానే ఉండడంతో సొంతిల్లు కట్టుకునే స్థోమత లేకపోయింది. ప్రభుత్వమే ఉచితంగా ఇల్లు కట్టి ఇచ్చినందుకు సంతోషంగా పూజా కార్యక్రమాలు నిర్వర్తించారు. కొత్తింట్లోకి రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఇచ్చిన మాట నిలబెట్టారు..
నా పేరు దివ్య. నేను గృహిణి కాగా.. మా ఆయన కిషన్ టైలర్ పని చేస్తడు. ఏడాది క్రితం అగ్నిప్రమాదంలో పాతిల్లు పూర్తిగా కాలిపోయింది. ఆ పాత ఇంటిలోనే అత్తమామలతో కలిసి చిన్న గదిలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడ్డం. గ్రామ సర్పంచ్ రమేశ్‌రెడ్డి కొత్త డబుల్బెడ్రూం ఇల్లు నిర్మిస్తున్నా మని, పూర్తయిన తర్వాత ఇస్తామని చెప్పిన్రు. ఇప్పుడు మాట నిలబెట్టుకొని డబుల్బెడ్రూం ఇల్లు పైసా ఖర్సు లేకుండా ఇచ్చిన్రు. ఇక సొంతింటిలో సంతోషంగా గడుపుతాం.
రూపాయి ఖర్సు లేకుండా సొంతింటికి వచ్చిన..
రూపాయి ఖర్సు లేకుండా సొంతింటికి వచ్చిన. ఎంతో సంతోషంగా ఉంది. ఇంతకుముందు చిన్న ఇల్లు ఉండేది. కొడుకు, కోడలు, అంతా కలిసి ఒకే దగ్గర ఉండడం ఇబ్బందిగా మారింది. మాకు వ్యవసాయ భూమి లేదు. కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటున్నం. వచ్చిన డబ్బులతో ఇంటి అవసరాలకే సరిపోయేవి. డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తున్నరని తెలిసి, దరఖాస్తు చేసుకున్న. నాకు కూడా ఇల్లు ఇచ్చిన్రు. సీఎం కేసీఆర్, మంత్రి అల్లోల, సర్పంచ్ రమేశ్‌రెడ్డికి రుణపడి ఉంటా.
-కామిడి లక్ష్మీనారాయణ, చిట్యాల్